Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? అంచనా తేదీలు ఇవే
Union Budget 2024: 8వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగియనున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ఈ సెషన్‌లో ప్రవేశపెడతారు.

ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైన నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి జూలైలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024పై పడింది.
మరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెడతారు? పార్లమెంట్ ప్రారంభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాగా 18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని కొత్త పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ లో ప్రకటించారు. అలాగే రాజ్యసభ సమావేశాలు జూన్ 27న ప్రారంభమై జులై 3న ముగుస్తాయని తెలిపారు. ఇటీవల ఎన్నికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. తరువాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దానిపై చర్చ ఉంటుంది.
బడ్జెట్ ఎప్పుడు?
ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు తాత్కాలిక బడ్జెట్. దానిలో సాధారణంగా ప్రధాన పాలసీ ప్రకటనలు లేదా మార్పులు ఉండవు.
నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం జూలైలో ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కొత్త ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వ్యయాలు మరియు ఆదాయ ప్రణాళికలను వివరిస్తుంది.
18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగియనున్న నేపథ్యంలో మొదటి భాగంలో ధన్యవాద తీర్మానం ఉంటుందని, ఇదే సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే కసరత్తుకు తగినంత సమయం లేనందున ఈ సెషన్‌ను రెండు భాగాలుగా విడదీసి రెండో భాగంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, దానిపై చర్చలకు ప్రభుత్వం మొగ్గుచూపవచ్చని తెలుస్తోంది.
జూలై 22న కేంద్ర బడ్జెట్ 2024 సమర్పణతో రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 9వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయని తెలుస్తోంది.