తక్షణ నగదు అవసరాల కోసం పర్సనల్ లోన్స్ ఒక ఈజీ పరిష్కారంగా మారాయి. ఎటువంటి హామీ (కొలేటరల్) లేకుండా సులభంగా నిధులను పొందడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. అనేక రుణదాతలు ఇప్పుడు మరింత సరళమైన కాలపరిమితులు (టెన్యూర్‌లు), వేగవంతమైన పంపిణీలను అందిస్తున్న నేపథ్యంలో.. పర్సనల్ లోన్ పొందడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇక్కడే మనం ఒక విషయం అర్థంం చేసుకోవాలి. వ్యక్తిగత రుణం అనేది రిస్కీ. ఆ రిస్క్ తీసుకోవడానికి సరైన కారణాలు ఉండాలి. ఇష్టమొచ్చిన దానికి లోన్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ తీసుకునేందుకు ఏది సరైన కారణం? ఎప్పుడు తీసుకోకూడదు? వంటి వివరాలపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నప్పుడే పర్సనల్ లోన్ తీసుకోవడం గురించి ఆలోచించాలి. ఇవి సాధారణంగా కింది పరిస్థితులకు ఉపయోగపడతాయి:
డెట్ కన్సాలిడేషన్: మీ మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడానికి వివిధ అప్పులను ఒకే రుణంగా మార్చుకోవడానికి.
వైద్య అత్యవసర పరిస్థితులు: శస్త్రచికిత్సలు, సంక్లిష్ట ఆపరేషన్లు లేదా ప్రమాదాలు వంటివి.
విద్య ఖర్చులు: మీకు లేదా మీ పిల్లల భవిష్యత్తుకు మద్దతు ఇచ్చే విద్య ఖర్చులు.
అవసరమైన ఇంటి మరమ్మతులు, పునరుద్ధరణ లేదా మెరుగుదలలు.
ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్ సహాయకరంగా ఉంటుంది. అయితే, మొత్తం రుణ కాలపరిమితిపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. ఎక్కువ కాలపరిమితులు నెలవారీ ఈఎంఐలను తగ్గించినప్పటికీ, అవి మొత్తం వడ్డీ చెల్లింపును పెంచుతాయి. తద్వారా కాలక్రమేణా రుణం మరింత ఖరీదైనదిగా మారుతుంది.
రిటైల్ క్రెడిట్ ఉత్పత్తుల్లో వ్యక్తిగత రుణాలకు అత్యధిక వడ్డీ రేట్లు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. వివాహాలు, విహారయాత్రలు లేదా గాడ్జెట్‌లు వంటి అత్యవసరం కాని లేదా జీవనశైలికి సంబంధించిన ఖర్చుల కోసం వీటిని ఉపయోగించడం సాధారణంగా సరైన ఆర్థిక నిర్ణయంగా పరిగణించరు.
పైగా పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు జరిమానాలు వంటి అదనపు ఛార్జీలు కూడా ఉంటాయి. వడ్డీతో పాటు ఇవి మరింత భారాన్ని మిగుల్చుతాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లేదా మీ ఆదాయం క్రమబద్ధంగా లేకపోయినా, రుణం గణనీయంగా అధిక ఖర్చుతో రావచ్చు!
"పర్సనల్ లోన్‌లో అత్యధిక వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి అవి ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలి! జీవనశైలి ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డులు వంటి అప్పులు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. రుణం తీసుకోవడం తప్పనిసరి అయితే, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడం, రుణదాతల మధ్య వడ్డీ రేట్లను పోల్చడం, ముందస్తు చెల్లింపు నిబంధనలను జాగ్రత్తగా సమీక్షించడం మంచిది," అని ఏయూఎం వెల్త్ వ్యవస్థాపకుడు, ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అమిత్ సూరి సలహా ఇచ్చారు.
"వ్యక్తిగత రుణాలు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడగలిగినప్పటికీ, అత్యవసర నిధులు లేదా తగిన బీమా కవరేజ్ ద్వారా వాటి కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు ఫైన్ ప్రింట్ చదవడం చాలా ముఖ్యం," అని సూరి తెలిపారు.
సంబంధిత కథనం