WhatsApp design: వాట్సాప్ డిజైన్ పూర్తిగా మారబోతోంది.. కొత్త కలర్స్, కొత్త ఐకన్స్, కొత్త టూల్స్..
ప్రముఖ షార్ట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో సరికొత్త రూపంలో దర్శనమివ్వబోతోంది. వాట్సాప్ డిజైన్ ను పూర్తిగా మార్చే దిశగా మెటా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే పలు టీమ్స్ వర్క్ చేస్తున్నాయని మెటా తెలిపింది. త్వరలో వాట్సాప్ కొత్త ఐకాన్లు, కొత్త రంగులు, కొత్త టూల్స్ తో కనిపించబోతోంది.
వాట్సాప్ లో గత కొన్ని నెలలుగా కొత్త ఫీచర్లు, అప్ డేట్ల ను తీసుకువస్తోంది. ఇప్పుడు, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్, మరెన్నో కొత్తదనాలతో పూర్తిగా కొత్త డిజైన్ తో రానుంది. వాట్సాప్ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో కనిపిస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి తాజా, సరళమైన, ఆకర్షణీయమైన డిజైన్ ను తీసుకురావడానికి ఈ మార్పులు చేసినట్లు వాట్సాప్ తెలిపింది. మీ వాట్సప్ లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసుకోండి.
వాట్సప్ కొత్త డిజైన్
మెటా బ్లాగ్ ప్రకారం, కంపెనీ వాట్సాప్ మొబైల్ యాప్ ను కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ తో రిఫ్రెష్ చేస్తోంది. యాప్ నకు యుటిలిటీని జోడించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని మెటా తెలిపింది. కొత్త డిజైన్ లో కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్స్ అండ్ ఇలస్ట్రేషన్స్, సరికొత్త నావిగేషన్ వంటి అనేక మార్పులు రానున్నాయి. వాట్సాప్ అనగానే గుర్తుకువచ్చే గ్రీన్ కలర్ డామినెన్స్ ను మాత్రం కొనసాగించనున్నారు. అదే కలర్ సరికొత్త రిఫ్రెష్ టోన్ తో వస్తోంది. ఇది యాప్ ను మరింత సహజంగా కనిపించేలా చేస్తుంది.
వాట్సప్ డిజైన్ లో మార్పులు ఇవే
కొత్త కలర్ ప్యాలెట్: డిజైన్ బృందం 35 రకాల రంగులను పరిగణనలోకి తీసుకుంది. ఆకుపచ్చ రంగు ప్రాధాన్యతను కొనసాగిస్తూనే, యాప్ ను మరింత సహజంగా, ఆకర్షణీయంగా మార్చే కలర్స్ ను ఉపయోగించాలని నిర్ణయించింది.
కొత్త ఐకాన్లు, ఇలస్ట్రేషన్స్: వాట్సాప్ మరింత స్టైల్ తో ఉన్న కొత్త ఐకాన్లను ప్రవేశపెడ్తోంది. ఇంకా, ఇప్పటివరకు యాప్ లో అందుబాటులో లేని మరిన్ని ఐకన్లు, యానిమేషన్లు, ఇలస్ట్రేషన్స్ ను తీసుకువస్తోంది. ఒరిజినల్ డిఫాల్ట్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా స్వల్ప మార్పులు చేస్తోంది.
మెరుగైన నావిగేషన్: మెరుగైన నావిగేషన్ కోసం, మెటా ఆండ్రాయిడ్ డివైజెస్ కోసం ఇప్పటికే కొత్త ఆధునిక బాటమ్ నావిగేషన్ బార్ ను ప్రవేశపెట్టింది. ఐఓఎస్ యూజర్ల కోసం ఫొటోలు, వీడియోలను పంపడానికి కొత్త అటాచ్మెంట్ లే అవుట్ కూడా ఉంది.
చాట్ మేనేజ్మెంట్: వాట్సాప్ ఇప్పుడు చాట్ ఫిల్టర్లు వంటి కొత్త టూల్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు అన్ రీడ్ లేదా గ్రూప్ చాట్లను సెలెక్ట్ చేసుకోవడానికి ట్యాబ్ కూడా ఉంటుంది.