ప్రస్తుత కాలంలో వాట్సాప్ తప్పనిసరైపోయింది. వాట్సాప్ లేనిది ఏ పని చేయలేనంతగా మారిపోయారు జనాలు. అయితే ఇది కూడా ఇప్పుడు సైబర్ నేరాలకు కేంద్రంగా మారింది. మరొక కొత్త రకం మోసం వచ్చింది. దీని బారిన మీరు పడకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. దీనిని మిస్సింగ్ పర్సన్ స్కామ్ అని పిలుస్తారు. ప్రజలకు తెలియని నంబర్ల నుండి ఫోటో వస్తోంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. భారతదేశంలో కూడా ఇలాంటి కేసులు కనిపించాయి.
వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు తప్పిపోయినట్లు ఫొటోలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆ ఫోటో మీద తప్పిపోయారు అని రాసి ఉంటుంది. ఈ ఫోటోపై క్లిక్ చేసిన వారి ఫోన్లు హ్యాక్ అయి, వారి బ్యాంకు ఖాతాలు క్షణాల్లో ఖాళీ అవుతాయి. ఈ సైబర్ మోసాన్ని 'వాట్సాప్ ఇమేజ్ స్కామ్' లేదా 'మాలిషియస్ లింక్ స్కామ్' అని కూడా పిలుస్తారు. మీకు వాట్సాప్‌లో తెలియని నంబర్ నుండి అలాంటి ఫోటో వస్తే పొరపాటున కూడా దానిపై క్లిక్ చేయకండి.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కూడా ఇలాంటి చిత్రాన్ని ఒక వ్యక్తి ఫోన్‌కు తెలియని నంబర్ నుండి పంపారు. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఫోన్ హ్యాక్ అయి.. కొన్ని నిమిషాల్లోనే అతని ఖాతా నుండి రూ. 2 లక్షలు విత్‌డ్రా అయ్యాయి.
ఈ స్కామ్‌ను తప్పించుకోలేమని కాదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు దీన్ని సులభంగా నివారించవచ్చు. హ్యాకర్లు మీ ఫోన్‌ను ఫోటో ద్వారా ఎలా హ్యాక్ చేస్తారో తెలుసుకుందాం.. నిజానికి హ్యాకర్లు తప్పిపోయిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలను హానికరమైన లింక్‌ను జత చేసి పంపుతారు. దానిపై క్లిక్ చేయగానే మీ ఫోన్‌లో ఒక యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. మీరు మీ ఇతర యాప్‌ల లిస్టులో ఈ యాప్‌ను చూడలేరు. తరువాత హ్యాకర్లు మీ ఫోన్‌పై నియంత్రణ సాధించి.. రిమోట్‌గా మీ ఖాతాను యాక్సెస్ చేయడం ద్వారా మోసానికి పాల్పడతారు.
ఈ స్కామ్‌ను నివారించడానికి తెలియని నంబర్ల నుండి వచ్చే ఏ రకమైన కంటెంట్‌కైనా దూరంగా ఉండండి. తెలియని నంబర్ల నుండి మీకు ఫోటోలు, లింక్‌లు లేదా మరేదైనా వస్తే పట్టించుకోకండి. దీనితో పాటు మీ వాట్సాప్‌లో ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్‌ను ఆఫ్‌లో ఉంచండి. మీకు అనుమానాస్పద నంబర్ నుండి సందేశం వస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేయడం మంచిది. తెలియని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు. దీనితో పాటు వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తూ ఉండటం ద్వారా మోసాలను నివారించవచ్చు.
సంబంధిత కథనం