వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్‌లో కొత్త ఫీచర్లు.. ఛానల్స్ ప్రమోషన్, సబ్‌స్క్రిప్షన్, యాడ్స్!-whatsapp new features channel subscriptions promoted channels and status ads with privacy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్‌లో కొత్త ఫీచర్లు.. ఛానల్స్ ప్రమోషన్, సబ్‌స్క్రిప్షన్, యాడ్స్!

వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్‌లో కొత్త ఫీచర్లు.. ఛానల్స్ ప్రమోషన్, సబ్‌స్క్రిప్షన్, యాడ్స్!

Anand Sai HT Telugu

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో అనేక కొత్త ఫీచర్లు రానున్నాయి. ఈ ఫీచర్లను యాప్ అప్‌డేట్స్ ట్యాబ్‌లో భాగం చేసిందని, త్వరలో యూజర్లకు అందులో యాడ్స్ కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ కొత్త ఫీచర్లు

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన అప్డేట్స్ ట్యాబ్‌లో అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే స్టేటస్, ఛానల్స్‌కు అంకితమైన ఈ ట్యాబ్‌ను ఇప్పుడు మరింత ఉపయోగకరంగా, ఆసక్తికరంగా మార్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ ట్యాబ్‌లో గత ఏడాది కాలంలో చేసిన మార్పులు వాట్సాప్‌లో కొత్తగా ఏదైనా సెర్చ్ చేసే అనుభవాన్ని యూజర్లకు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 1.5 బిలియన్లకు పైగా ప్రజలు ఈ అప్డేట్స్ ట్యాబ్‌ను ఉపయోగిస్తున్నారని యాప్ పేర్కొంది. ఈ ఫీచర్‌ను రోజూ ఉపయోగించే అడ్మిన్లు, గ్రూపులు, వ్యాపారాలకు మరింత మద్దతును అందించడమే లక్ష్యంగా మార్పులు చేశారు. అయితే ఈ ఫీచర్లన్నీ అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. మీరు వాట్సాప్‌ను కేవలం పర్సనల్ చాట్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తే ఈ మార్పులు కనిపించవు. యాప్‌లో భాగంగా చేసిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఛానల్ సబ్‌స్క్రిప్షన్

ఇప్పుడు యూజర్లు తమకు ఇష్టమైన ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీని కోసం వారు నెలవారీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన కంటెంట్ లభిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఛానల్ అడ్మిన్లకు రెగ్యులర్ సపోర్ట్ పొందే అవకాశం లభిస్తుంది.

ప్రమోట్ ఛానల్స్

కొత్త ఛానళ్లను కనుగొనడానికి వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులకు సహాయపడుతుంది. ఛానల్ అడ్మిన్లు తమ ఉనికిని పెంచుకోవడానికి, ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రమోషన్లను ఉపయోగించుకోవచ్చు.

స్టేటస్ యాడ్స్

ఇప్పుడు ఛానల్స్, బిజినెస్‌లు స్టేటస్ ట్యాబ్‌లో తమ యాడ్స్‌ను చూపించగలవు. దీని ద్వారా ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన చాట్‌ను ప్రారంభించడానికి యూజర్లకు సులభమైన అవకాశం లభిస్తుంది. ఇది బిజినెస్ కమ్యూనికేషన్‌కు ప్రత్యేక అవకాశాలను ఇస్తుంది. వాట్సప్ ఈ ఫీచర్లన్నింటినీ సిద్ధం చేసేటప్పుడు ప్రైవసీ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. మీ వ్యక్తిగత సందేశాలు, కాల్స్, స్టేటస్లు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ ఉంటాయని, వాటిని ఎవరూ చూడలేరని లేదా వినలేరని కంపెనీ పేర్కొంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.