వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి పీడీఎఫ్ చేసుకునే ఫీచర్.. ఇక పక్క యాప్స్‌కు వెళ్లాల్సిన పని లేదు!-whatsapp new feature document scanning users can scan and share documents as pdf file ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి పీడీఎఫ్ చేసుకునే ఫీచర్.. ఇక పక్క యాప్స్‌కు వెళ్లాల్సిన పని లేదు!

వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి పీడీఎఫ్ చేసుకునే ఫీచర్.. ఇక పక్క యాప్స్‌కు వెళ్లాల్సిన పని లేదు!

Anand Sai HT Telugu

వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. ఇప్పుడు మరో కిర్రాక్ ఫీచర్‌ను తీసుకువస్తుంది. దీంతో వాట్సాప్‌లోనే మీరు డాక్యుమెంట్లను స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ నుంచి డాక్యుమెంట్లను పంపడానికి వేరే యాప్స్ ఉపయోగించాలి. అయితే ఇందుకోసం వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ వాబెటాఇన్ఫో నివేదిక ప్రకారం.. డాక్యుమెంట్లను స్కాన్ చేసే ఫీచర్ వాట్సాప్‌లో వస్తుంది. దీని కోసం ఇప్పటివరకు థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.

వాట్సాప్ ఇప్పుడు తన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది యాప్ నుండి నేరుగా డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి, పీడీఎఫ్ ఫైల్స్‌ను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. కొన్ని నెలలుగా ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడంతో థర్డ్ పార్టీ డాక్యుమెంట్ స్కానర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

ఇప్పుడు ఇమేజ్‌ను వాట్సాప్ నుంచే డాక్యుమెంట్‌గా మార్చుకోవచ్చు. దీనిని పీడీఎఫ్ రూపంలో ఇతర కాంటాక్టులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.29 కోసం వాట్సాప్ బీటాలో మొదట ఈ ఫీచర్ కనిపించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదించింది. ఇప్పుడు ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ అప్డేట్‌ను చేసుకున్న తర్వాత చాలా మంది యూజర్లు కొత్త ఫీచర్లకు యాక్సెస్ పొందుతున్నారు. రానున్న కాలంలో యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

ఇది యాప్ కెమెరా నుండి నేరుగా పత్రాలను స్కాన్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. కొత్త ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఆండ్రాయిడ్ డివైజ్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇది యూజర్లకు లైవ్ ప్రివ్యూను చూపిస్తుంది. క్యాప్చర్ కోసం డాక్యుమెంట్‌ను సరైన పొజిషన్‌లో ఉంచడానికి యూజర్‌కు సహాయపడుతుంది.

వాట్సాప్ యూజర్లకు 'మాన్యువల్', 'ఆటో క్యాప్చర్' అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మాన్యువల్ ఆప్షన్ కింద వినియోగదారులు డాక్యుమెంట్ ఏ భాగాన్ని స్కాన్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించగలరు. ఆటో క్యాప్చర్ మోడ్‌లో యాప్ స్వయంగా డాక్యుమెంట్ అంచులను గుర్తిస్తుంది. డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి ఫోటోను క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫొటోను క్యాప్చర్ చేసిన వెంటనే వాట్సప్ దాన్ని ప్రాసెస్ చేసి పీడీఎఫ్ ఫైల్‌గా మారుస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.