Zero Click Hack : జీరో క్లిక్ హ్యాక్.. మీరు ఏం క్లిక్ చేయకపోయినా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది!-whatsapp hacking alert what is zero click hack and why it is dangerous know how to prevent it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zero Click Hack : జీరో క్లిక్ హ్యాక్.. మీరు ఏం క్లిక్ చేయకపోయినా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది!

Zero Click Hack : జీరో క్లిక్ హ్యాక్.. మీరు ఏం క్లిక్ చేయకపోయినా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది!

Anand Sai HT Telugu Published Feb 09, 2025 06:30 PM IST
Anand Sai HT Telugu
Published Feb 09, 2025 06:30 PM IST

Zero Click Hack : మీరు ఎలాంటి అనవసరమైనవి క్లిక్ చేయకుండానే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని మీకు తెలుసా? ఇప్పుడు జీరో క్లిక్ హ్యాక్‌తో జనాలను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.

జీరో క్లిక్ హ్యాక్(ప్రతీకాత్మక చిత్రం)
జీరో క్లిక్ హ్యాక్(ప్రతీకాత్మక చిత్రం)

ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ కార్యకలాపాలతోపాటుగా సైబర్ అటాక్స్ కూడా ఎక్కువే అవుతున్నాయి. రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను వాడుతున్నారు. సాధారణంగా ఫిషింగ్ లింక్‌లు, అనుమానాస్పద ఫైల్‌లను క్లిక్ చేస్తే.. హ్యాక్ చేయవచ్చు అని వింటుంటాం. కానీ ఇప్పుడు జీరో క్లిక్ హ్యాక్ వంటి కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. దీనిలో ఏ లింక్‌పై క్లిక్ చేయకుండానే పరికరాన్ని హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్లు. ఈ జీరో క్లిక్ హ్యాక్ అంటే ఏంటి? చూద్దాం..

జీరో క్లిక్ హ్యాక్ అంటే

జీరో క్లిక్ హ్యాక్ అనేది ఓ రకమైన సైబర్ దాడి. దీనిలో హ్యాకర్లు వినియోగదారులు ఎలాంటి పనిని తమ ఫోన్‌లో చేయకున్నా.. పరికరాన్ని హ్యాక్ చేస్తారు. సాంప్రదాయ ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా దీనికి ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం అవసరం లేదు. హ్యాకర్లు ఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆసరాగా చేసుకుని మెసేజింగ్ యాప్, ఇమెయిల్ క్లయింట్ లేదా మల్టీమీడియా ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పరికరాన్ని హ్యాక్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది.

వాట్సాప్ ప్రకారం 90 మంది యూజర్లు టార్గెట్‌గా జీరో క్లిక్ హ్యాకింగ్ జరిగింది. ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్ సృష్టించిన స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసుకున్నట్లు వెల్లడించింది. బాధితుల్లో జర్నలిస్టులు, సాధారణ ప్రజలు, ముఖ్యమైనవారు ఉన్నారు.

మీకు కూడా తెలియదు

ముందుగా హ్యాకర్లు హానికరమైన ఫైల్‌లను పరికరానికి పంపుతారు. వాటిని సిస్టమ్ స్వయంచాలకంగా ప్రాసెస్ చేస్తుంది. తరువాత హానికరమైన ఫైల్‌లు వాటికవే సందేశాలు, కాల్‌లు, ఫోటోలు, మైక్రోఫోన్, కెమెరాను యాక్సెస్ చేస్తాయి. ఈ దాడి చాలా తెలివిగా జరుగుతుంది. ఈ విషయం వినియోగదారుడికి కూడా తెలియదు.

ఇలా చేయాలి

ఈ ప్రమాదకరమైన సైబర్ దాడిని నివారించడానికి, మీ యాప్‌లు, పరికరాలను ఎల్లప్పుడూ అప్‌డేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉంటేనే ఈ హ్యాక్ పనిచేస్తుంది. అందువల్ల ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మాత్రమే కాదు బ్యాటరీ అకస్మాత్తుగా ఖాళీ కావడం ప్రారంభిస్తే, తెలియని సందేశాలు రావడం ప్రారంభిస్తే, యాప్‌లు ఆటోమేటిక్‌గా వాటికవే కదులుతున్నట్టుగా అనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఇజ్రాయెల్‌కు చెందిన పారగాన్ సోల్యూషన్స్ జీరో క్లిక్ హ్యాక్‌ చేసిందని వాట్సాప్ ఎలా కన్ఫర్మ్ చేసిందని వెల్లడించలేదు. ఇప్పటికే అధికారులకు ఈ విషయంపై రిపోర్ట్ చేసింది. వాట్సాప్ చెప్పిన సందేశం యూజర్లకు హెచ్చరికలాంటిది. ఫోన్లను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. మెసెజ్‌లు, డాక్యుమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Whats_app_banner