WhatsApp Channels: వాట్సాప్ చానల్స్ లో కూడా ఇకపై ఈ యూజ్ ఫుల్ ఫీచర్స్ లభిస్తాయి..
WhatsApp Channels: వ్యక్తులు, సంస్థలను కనెక్ట్ చేసే సాధనంగా ఉన్న వాట్సాప్ చానల్ లో ఇకపై పలు ముఖ్యమైన ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.
WhatsApp Channels: అడ్మినిస్ట్రేటర్లు, ఫాలోవర్ల మధ్య ఇంటరాక్షన్ పెంచేందుకు రూపొందించిన 'వాట్సాప్ ఛానల్స్ (WhatsApp Channels)' లో వాట్సాప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటి గురించి గతంలోనే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పుడు ఈ ఫీచర్లు క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలో ఛానల్ కంటెంట్ ను "స్టేటస్ అప్డేట్" గా కూడా పెట్టుకునేలా కొత్త ఫీచర్ ను తీసుకురానున్నారు.
ఈ ఫీచర్స్ కూడా..
వాట్సాప్ చానల్స్ (WhatsApp Channels) లో కొత్తగా అందుబాటులోకి రానున్న ఫీచర్స్ గురించి మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. వాట్సాప్ ను వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఈ ఫీచర్స్ మారుస్తాయని ఆయన తెలిపారు. ఈ ఫీచర్స్ లో ప్రధానంగా.. వాయిస్ నోట్స్, మల్టిపుల్ అడ్మిన్స్, స్టేటస్, పోల్స్ పంచుకోవడం మొదలైనవి ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్లు క్రమంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ లలో ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
50 కోట్లు..
వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ ఇప్పటికే 500 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను సంపాదించిందని వాట్సాప్ ప్రకటించింది. కత్రినా కైఫ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలతో పాటు ముంబై ఇండియన్స్, మెర్సిడెస్ ఎఫ్ 1, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్స్ వాట్సాప్ చానల్స్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వ్యక్తులు, సంస్థల నుంచి ముఖ్యమైన అప్ డేట్స్ ను ప్రైవేట్ చాట్లకు భిన్నంగా నేరుగా వాట్సాప్ లోనే స్వీకరించేందుకు వాట్సాప్ ఛానల్స్ వీలు కల్పిస్తాయి. ప్రొడక్ట్ డెవలప్ మెంట్స్ పై డైరెక్ట్ అప్ డేట్స్ కోరుకునే వారు సంబంధిత కంపెనీ అధికారిక వాట్సప్ ఛానల్ ను ఫాలో అవ్వడం మంచిది.
షేర్ టు స్టేటస్
వాట్సాప్ చానల్ లో పోస్ట్ చేసిన అప్ డేట్ ను ఫాలోవర్లుగా ఉన్నవారు తమ స్టేటస్ (WhatsApp status) గా కూడా షేర్ చేసుకునే వీలు కల్పించే కొత్త ఫీచర్ ను వాట్సాప్ అప్ డేట్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు వేరే వ్యక్తి లేదా సంస్థల వాట్సాప్ ఛానల్ అప్ డేట్ ను తమ వ్యక్తిగత వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
పోల్స్
యూజర్ ఎంగేజ్మెంట్ కోసం వివిధ అంశాలపై పోల్స్ ను నిర్వహించే అవకాశం ఇకపై వాట్సాప్ ఛానెళ్లకు కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఛానల్ అడ్మిన్ తమ ఫాలోవర్లు పాల్గొనేలా ఒక పోల్ ను నిర్వహించవచ్చు. వారి నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకోవచ్చు. ప్లాట్ఫామ్లో పెరిగిన పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. జుకర్ బర్గ్ (Zuckerberg) తన వ్యక్తిగత వాట్సాప్ ఛానెల్ లో తన ఫాలోవర్లను 'ఆల్ టైమ్ బెస్ట్ గేమ్' కోసం ఓటింగ్ లో పాల్గొనమని ఆహ్వానిస్తూ ఒక 'పోల్' ను చేర్చాడు.
వాయిస్ అప్ డేట్స్
వాట్సాప్ చానల్ వినియోగదారులు ఇప్పుడు తమ ఛానెల్స్ లో వాయిస్ అప్ డేట్ (voice update) లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ లో ప్రతీరోజు దాదాపు 700 కోట్ల వాయిస్ మెసేజ్ లు పంపుతుంటారు. ఇప్పుడు ఈ ఫీచర్ వాట్సాప్ చానల్స్ కు కూడా అందుబాటులోకి వచ్చింది. చానల్ అడ్మిన్ తన ఫాలోవర్లకు వాయిస్ మెసేజ్ ను పంపించే వీలు కల్పించే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
మల్టిపుల్ అడ్మిన్స్..
ఇకపై ఒక వాట్సాప్ చానల్ కు గరిష్టంగా 16 మంది అడ్మిన్స్ ఉండేలా కొత్త ఫీచర్ ను తీసుకువచ్చారు. దీనివల్ల చానల్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలను అప్ డేట్ చేస్తుండవచ్చు.