iPhone, iPad లో ‘i’ కి అర్థమేంటో మీకు తెలుసా?
Apple iPhone : యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్, ఐపిల్ ఐపాడ్.. ఇలా యాపిల్ ప్రాడక్ట్స్ ఇప్పుడు చాలా మంది జీవితాల్లో ఒక భాగమైపోయాయి. కానీ, ఐఫోన్- ఐప్యాడ్‌లోని ‘ఐ’ అంటే ఏంటో మీకు తెలుసా? దీనికి ఒకటి కాదు 5 సమాధానాలు ఉన్నాయి.
దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ నుంచి ఏ ప్రాడక్ట్ వచ్చినా, అది సంచలనమే! దశాబ్దాలుగా ఆ స్థాయిలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ వాల్యూని నిర్మించుకుంది యాపిల్. ఐఫోన్ నుంచి ఐప్యాడ్, ఐపాడ్, ఐమ్యాక్ వరకు.. యాపిల్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన ప్రాడక్ట్స్‌ని, టెక్నాలజీని సంస్థ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉంటుంది. యాపిల్ నుంచి ఏ ఈవెంట్ వచ్చినా, టెక్ వర్గాలు ఎంతో ఆసక్తిగా చూస్తాయి. కానీ, యాపిల్‌కి సంబంధిన ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. iPhone, iPod, iPad వంటి గ్యాడ్జెట్స్‌లో 'i' అంటే ఏంటి? అన్నది చాలా మందికి తెలియదు. కొందరు ఆ 'i' ని ఇంటర్నెట్ అనుకుంటున్నారు. కానీ ఈ ‘ఐ’ అనే పదం వెనుక చాలా అర్థాలే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐఫోన్లో ఐ అంటే ఏంటి? అని అడిగితే, ఒకటి కాదు- ఐదు సమాధానాలు లభిస్తాయి.
యాపిల్ ప్రాడక్ట్స్‌లో ఉండే 'ఐ'కి అర్థమేంటి?
యాపిల్ ప్రాడక్ట్స్‌లో ఉండే 'ఐ' చరిత్ర 1998లో మొదలైంది. ఆ ఏడాది ఐమ్యాక్ని తొలిసారి ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ 'ఐ' అంటే కేవలం ఒక అక్షరం మాత్రమే కాదని, తన ప్రాడక్ట్స్‌లో సంస్థ జోడించాలనుకుంటున్న విలువలు, సూత్రాలకు ప్రతిబింబం అని అన్నారు.
స్టీవ్ జాబ్స్ ప్రకారం 'i' అంటే.. internet (అంతర్జాలం), individual (వ్యక్తిగతం), instruct (ఉపదేశం), inform (తెలియజేయడం), inspire (స్ఫూర్తిని నింపడం). అంతేకాదు, ఈ 'ఐ'ని స్టీవ్ జాబ్స్ ఒక సర్వనామం (ప్రొనౌన్)గా పరిచయం చేశారు.
Instruct అనేది యూజర్స్‌ని ఎడ్యుకేట్ చేయడంలో యాపిల్ నిబద్ధతను సూచిస్తుంది. Inform, Inspire అనేవి కస్టమర్లకు జ్ఞానం, స్ఫూర్తిని ఇవ్వాలన్న కంపెనీ లక్ష్యాలకు ప్రతీకగా నిలుస్తాయి.
ఏ కొత్త ప్రాడక్ట్ తీసుకురావాలన్నా, యాపిల్ విజన్‌లో ఈ 5 'ఐ'లు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా ప్రపంచం మారుతున్న కొద్ది, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, సంస్థ పునాదులను విస్మరించకుండా, ఈ 'ఐ'కి అర్థాన్ని విస్తరిస్తూ వస్తోంది యాపిల్. ఉదాహరణకు యాపిల్ ప్రాడక్ట్స్‌లో ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్‌తో ఇప్పుడు 'ఐ' కాస్తా.. Intelligence గా మారింది. కానీ మొదటి చెప్పిన ఐదు 'ఐ'ల ఫిలాసఫీ మాత్రం అలాగే ఉంది.
పునాదులు బలంగా ఉంటేనే ఏ వ్యాపారమైన రాణించగలుగుతుంది. ఇందుకు యాపిల్ చక్కటి ఉదాహరణ. దశాబ్దాలు మారినా, టెక్నాలజీ మారినా, ఈ సంస్థ తన సూత్రాలపై నిలబడి, ఎప్పటికప్పుడు సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకుంటూ ముందుకెళుతోంది. కస్టమర్స్‌ని అలరిస్తోంది.
సంబంధిత కథనం