DeepSeek : అసలేంటి ఈ డీప్​సీక్​? చైనా ఏఐని చూసి సిలికాన్​ వ్యాలీ ఎందుకు వణుకుతోంది?-what is deepseek chinese ai model outshining chatgpt and shaking up ai world ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Deepseek : అసలేంటి ఈ డీప్​సీక్​? చైనా ఏఐని చూసి సిలికాన్​ వ్యాలీ ఎందుకు వణుకుతోంది?

DeepSeek : అసలేంటి ఈ డీప్​సీక్​? చైనా ఏఐని చూసి సిలికాన్​ వ్యాలీ ఎందుకు వణుకుతోంది?

Sharath Chitturi HT Telugu
Jan 28, 2025 07:39 AM IST

DeepSeek AI : చైనాకు చెందిన డీప్​సీక్ అనే స్టార్టప్​ సంస్థ సంచలనం సృష్టించింది. తక్కువ ఖర్చు, హై- ఎఫీషియెన్సీ ఏఐ మోడల్​ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్​జీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్​లో టాప్​లో నిలిచింది. డీప్​సీక్​ పూర్తి వివరాలు..

డీప్​సీక్​ ఏఐ..
డీప్​సీక్​ ఏఐ.. (AFP)

చైనా మరో అద్భుతం చేసింది! ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ రంగంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ "డీప్​సీక్​".. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడళ్లను రూపొందించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. దీనిని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని లీడింగ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా సిలికాన్​ వ్యాలీలోని దిగ్గజ టెక్​ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా టెక్​ ఇండెక్స్​ కుప్పకూలింది. అసలేంటి ఈ డీప్​సీక్​?

yearly horoscope entry point

డీప్​సీక్ అంటే ఏమిటి?

డీప్​సీక్​ ఏఐ మోడల్​ని డీప్​సీక్​ ఆర్​1 అని పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్​లో స్పెషలైజేషన్ చేసిన ఇంజినీర్, ఎంటర్​ప్రెన్యూర్ లియాంగ్ వెన్​ఫెంగ్ 2023లో ఈ డీప్​సీక్​ని స్థాపించారు. డీప్​సీక్ సృష్టించడానికి ముందు, ఆయన ఆర్థిక డేటాను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగించే హెడ్జ్ ఫండ్​కు నాయకత్వం వహించారు.

ఇప్పుడు లియాంగ్ బృందంలో అగ్రశ్రేణి చైనా విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఈ కంపెనీ ఓపెన్​సోర్స్​ ఏఐ మోడల్స్​ని డెవలప్​ చేసింది. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్​కి ఇచ్చింది. వారు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్​సీక్​ ఆర్​ని వాడుకుంటున్నారు.​

ఓపెన్ఏఐ నుంచి డీప్​సీక్ ఎలా భిన్నంగా ఉంటుంది?

డీప్​సీక్​ సంచలనంగా మారడంతో దానిని ఇప్పుడు ఓపెన్​ఏఐకి చెందిన చాట్​జీపీటీతో పాటు ఇతర ఏఐ మోడల్స్​తో పోల్చుతున్నారు. ప్రాంప్ట్​కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్​ కూడా ఇస్తుండటం.. ఇతర మోడల్స్​కి డీప్​సీక్​ ఆర్​1కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. సక్సెస్​ఫుల్​ ఓపెన్​ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. మోస్ట్​ సక్సెస్​ఫుల్​ ఏఐ మోడల్స్​ని రన్​ చేసేందుకు సంస్థలు బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తుంటే, వాటిల్లో సగం కూడా ఖర్చు చేయకుండానే ఏఐ మోడల్స్​ని తీసుకొచ్చింది డీప్​సీక్​.

అంతేకాదు, ప్రత్యర్థి మోడల్స్​తో పోల్చితే తన ఆర్​ఐ.. మాథ్య్స్​, జీకే, క్వశ్చన్​ అండ్​ ఆన్సర్​ పర్ఫార్మెన్స్​లో చాలా బెటర్​ అని డీప్​సిక్​ చెబుతోంది.

యాపిల్​లో టాప్​- ఆ వెంటనే సైబర్​ దాడి..

ప్రపంచవ్యాప్తంగా ఈ డీప్​సీక్​కి డౌన్​లోడ్స్​ వెల్లువెత్తాయి. ముఖ్యంగా అమెరికాలో యాపిల్ యాప్​​ స్టోర్​లో చాట్​జీపీటీని వెనక్కి నెట్టి, ఈ డీప్​సీక్​ ఆర్​1 టాప్​లో (ఫ్రీ యాప్స్​) నిలిచింది. డౌన్​లోడ్స్​ తాకిడిని తట్టుకోలేక యాప్​ క్రాష్​ కూడా అయ్యింది. దానిని టీమ్​ పునరుద్ధరించింది.

ఆ వెంటనే డీప్​సీక్​ ఐఏ అసిస్ట్​పై సైబర్​ దాడి జరిగింది. ఈ విషయాన్ని చైనా సంస్థ స్వయంగా ప్రకటించింది. ఫలితంగా.. రిజిస్ట్రేషన్​ని తాత్కాలికంగా లిమిట్​ చేస్తున్నట్టు డీప్​సీక్​ వెల్లడించింది.

అమెరికా ఆందోళన ఏంటి?

సాంకేతిక ఆధిపత్య రేసులో చైనా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, జీపీయూ సెమీకండక్టర్ల వంటి హై-ఎండ్ టెక్నాలజీలను చైనాకు ఎగుమతి చేయడాన్ని అమెరికా నిషేధించింది! కానీ ఇవేవీ చైనాని ప్రభావితం చూపలేదని డీప్​సీక్ సక్సెస్​తో స్పష్టమవుతోంది. ఎన్ని ఆంక్షలు ఉన్నా, చైనా ఏఐ ఇంజనీర్లు తమ వంతు కృషి చేసి.. తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ మోడల్స్​ని రూపొందించడంలో విజయం సాధించారు.

మెటా, మొక్రోసాఫ్ట్​ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఇప్పుడు డీప్​సీక్​ వస్తుండటంతో.. "మీరెందుకు అలా చేయలేకపోతున్నారు?" అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా ఆయా కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తుంది.

నాస్​డాక్​ డౌన్​- ఎన్​విడియా స్టాక్​లో రక్తపాతం..!

ఏఐపై భారీ ఆశలు పెట్టుకున్న టెక్​ కంపెనీలకు డీప్​సీక్​ షాక్​ ఇవ్వడంతో అమెరికా నాస్​డాక్ 3శాతం​ పతనమైంది. మరీ ముఖ్యంగా ఎన్​విడియా సంస్థ షేర్లు 17శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ ఒక్క ట్రేడింగ్​ సెషన్​లో దాదాపు 600 బిలియన్​ డాలర్లను కోల్పోయింది.

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కోసం భారీ డేటా, భారీ టెక్​ కావాల్సి వస్తుందని ఇప్పటివరకు అంచనాలు ఉన్నాయి. వాటిని తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో ఎన్​విడియా ఒకటి. ఏఐ కారణంగా ఎన్​విడియా చిప్​లకు భారీగా డిమాండ్​ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే గతంలో ఈ స్టాక్​ భారీగా పెరిగింది కూడా!

కానీ ఇప్పుడు.. పెద్దగా డేటా, టెక్​, స్టోరేజ్​ అవసరం లేకుండానే ఏఐ మోడల్స్​ని తయారు చేయడంతో ఎన్​విడియాపై ఉన్న అంచనాలు తారుమారయ్యాయి. అందుకే ఈ స్టాక్​ 17శాతం మేర పడింది.

డీప్​సీక్​లోపాలు ఏమిటి?

డీప్​సీక్​కి ఉన్న పెద్ద లోపం.. అదొక చైనా కంపెనీ కావడం! భద్రత విషయంలో చైనా యాప్స్​పై ఎప్పుడు అనుమానాలు ఉంటూనే ఉంటాయి.

అంతేకాదు, డీప్ సీక్, ఇతర చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మాదిరిగానే, చైనాలో సున్నితమైన అంశాలపై స్వీయ సెన్సార్​షిప్​ని ప్రదర్శిస్తుంది. ఇది 1989 తియానన్మెన్ స్క్వేర్ నిరసనలు లేదా తైవాన్​పై చైనా దురాక్రమణ వంటి సంఘటనల గురించి ప్రశ్నలను పరిష్కరించకుండా తప్పించుకుంటుంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్​పైనా వ్యాఖ్యానించడానికి కూడా ఈ ఏఐ నిరాకరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం