వేతన జీవుల్లో చాలా మంది ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్‌లు ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి. అయితే, మితిమీరిన వినియోగం వల్ల క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చాలా మంది క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ కూడా చదవడం రావడం లేదు! ఇది సరైనది కాదు. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థ మీకు ప్రతి నెలా ఒక క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను పంపుతుంది. ఇందులో నిర్దిష్ట బిల్లింగ్ సైకిల్‌కు సంబంధించిన మీ బకాయిలు, చెల్లింపులు, లావాదేవీలన్నీ ఉంటాయి. ప్రాథమికంగా, ఇది మీకు చెల్లింపులు చేయమని గుర్తు చేస్తుంది. మీ క్రెడిట్ వినియోగ రికార్డును నిర్వహిస్తుంది. ఇందులో కింది సమాచారం ఉంటుంది:
బకాయి మొత్తం.
చెల్లించాల్సిన కనీస మొత్తం.
స్టేట్‌మెంట్ గడువు తేదీ.
లావాదేవీలు- కొనుగోళ్ల వివరాలు.
వసూలు చేసిన వడ్డీ, ఆలస్య రుసుములు (ఏవైనా ఉంటే).
లభ్యమయ్యే నగదు- క్రెడిట్ పరిమితులు.
రివార్డ్ పాయింట్లు (వర్తిస్తే).
స్టేట్‌మెంట్ పీరియడ్: ఇది బిల్లింగ్ సైకిల్‌కు వర్తించే తేదీలు, తద్వారా మీరు కార్డ్‌లోని కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు.
చెల్లింపు గడువు తేదీ: ఆలస్య రుసుములు లేదా వడ్డీ లేకుండా చెల్లించడానికి ఇది చివరి తేదీ.
బకాయి మొత్తం: బిల్లింగ్ సైకిల్‌లో చెల్లించాల్సిన మొత్తం.
కనీస బకాయి మొత్తం: ఖాతాను మంచి స్థితిలో ఉంచడానికి, ఆలస్య రుసుములను నివారించడానికి కనీసం చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ మొత్తం.
లావాదేవీల సారాంశం: లావాదేవీలు, కొనుగోళ్లు, క్రెడిట్‌లు, ఈఎంఐ డెబిట్‌ల పూర్తి వివరణాత్మక రికార్డు.
వడ్డీ ఛార్జీలు- రుసుములు : క్రెడిట్ కార్డ్ వాడిన అనంతరం చెల్లించని బకాయిలపై వసూలు చేసిన మొత్తం వడ్డీ, అన్ని రుసుములు.
క్రెడిట్ పరిమితి: మీ మొత్తం క్రెడిట్ మొత్తం, ఇంకా ఉపయోగంలో లేని మొత్తం క్రెడిట్.
చాలా మంది కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని స్టేట్‌మెంట్‌గా తప్పుగా భావిస్తారు.
క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో (సాధారణంగా 30 రోజులు) జరిగిన అన్ని ఛార్జీలు, లావాదేవీలను ఒకే చోట చూపించే పత్రం.
మరోవైపు, మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అనేది మీరు ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తం. ఇది స్టేట్‌మెంట్ ప్రింటైన్ తర్వాత జరిగిన ఇటీవలి కొనుగోళ్లను కూడా ప్రతిబింబిస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, బ్యాలెన్స్ అనేది ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తం.. స్టేట్‌మెంట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన చారిత్రక రికార్డును కలిగి ఉంటుంది.
ఖచ్చితంగా చెల్లించాలి, ఎందుకంటే:
వడ్డీ చెల్లించడం మానుకోవచ్చు: పూర్తి మొత్తం చెల్లించడం ద్వారా వడ్డీ భారాన్ని నివారించవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు: సకాలంలో చెల్లింపులు మంచి క్రెడిట్ స్కోర్‌కు దారితీస్తాయి.
మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచుకోవచ్చు: ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు కీలకం.
పెనాల్టీలు- ఆలస్య రుసుములను నివారించవచ్చు: గడువులోగా చెల్లించడం వల్ల అదనపు ఛార్జీలు పడవు.
క్లీన్ రీ-పేమెంట్ హిస్టరీని నిర్వహించవచ్చు: ఇది భవిష్యత్ రుణాలకు సహాయపడుతుంది.
మీరు కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే, మిగిలిన బకాయిపై వడ్డీ వసూలు చేస్తారు. అది నిర్వహించలేని స్థాయికి చేరుకోవచ్చు.
చివరిగా.. మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ కేవలం ఒక బిల్లు కంటే ఎక్కువ; ఇది ఒక ఆర్థిక నిర్వహణ సాధనం. మీ స్టేట్‌మెంట్‌ను చదవడం, దానిపై చర్య తీసుకోవడం ద్వారా మీరు రుణ భారాన్ని నివారించవచ్చు. బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు.
సంబంధిత కథనం