ిగరెట్ తాగే చాలా మంది చెప్పేమాట.. ఇదే లాస్ట్ అని. కానీ మరుసటి రోజు మళ్లీ దాని మీదకు మనసు వెళ్లి ధూమపానం చేస్తుంటారు. భవిష్యత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే.. బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలతో సహా ఏదైనా సమాచారాన్ని దాచిపెడితే.. తర్వాత అది మీకు కష్టంగా అవుతుంది. మీకు ధూమపానం చేసే అలవాటు ఉంటే.. మీరు దానిని పాలసీలో కచ్చితంగా చెప్పాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు.
పొగాకు వాడకం, ముఖ్యంగా ధూమపానం.. భారతదేశంలో అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి. భారతదేశంలో చాలా మంది దీని బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులకు సిగరెట్ వ్యసనం ప్రధాన కారణం. దీంతో ఈ అలవాటు ఉన్నవారికి బీమా కంపెనీలు పాలసీలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి.
మీకు ధూమపానం చేసే అలవాటు ఉంటే.. టర్మ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు మీరు ఎక్కువ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బీమా కంపెనీలు ప్రీమియం రెట్టింపు చెల్లించమని మిమ్మల్ని అడగవచ్చు. ఆరోగ్య బీమా ఇచ్చే సమయంలో కంపెనీలు వ్యక్తి వివరాలతోపాటుగా అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మెడికల్ చెకప్ చేయించుకోమని చెబుతుంటాయి. అందులో వచ్చిన రిజల్ట్ ఆధారంగా బీమా ప్రీమియాన్ని వసూలు చేస్తాయి.
అయితే ఆరోగ్య బీమా విషయంలో స్వల్ప సడలింపు ఉంది. మీరు 12 నుండి 24 నెలలుగా పొగాకు జోలికి వెళ్లలేదని వైద్య రుజువును అందించాలి. మీరు రాబోయే పాలసీ పునరుద్ధరణ సమయంలో ఈ పత్రాన్ని సమర్పిస్తే.. మీరు ధూమపానం చేయని వ్యక్తిగా తిరిగి చూస్తారు. మీ ప్రీమియం తగ్గించవచ్చు.
మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ధూమపానం మానేస్తే, ప్రీమియం తగ్గే అవకాశం తక్కువ. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించిన తర్వాత, అది చివరి వరకు మారదు. ఒకవేళ మీరు విషయాన్ని దాచిపెట్టి.. పాలసీ తీసుకున్నా.. దురదృష్టవశాత్తు మరణిస్తే.. క్లెయిమ్ చేసినప్పుడు బీమా కంపెనీ మృతికి కారణాలు తెలుసుకుంటుంది. వివరాలు దాచి పాలసీ తీసుకుంటే క్లెయిమ్ తిరస్కరించవచ్చు. అందుకే ముందే చెబితే.. పొగతాగే వారికి ఇచ్చే బీమాకు ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంది.
చాలా బీమా కంపెనీలు పాలసీ జారీ చేసే ముందు వైద్య పరీక్ష నిర్వహిస్తాయి. ఈ సందర్భంలో నికోటిన్ ఉందో లేదో తెలుసుకోవడానికి వ్యక్తి రక్తం, మూత్రం, మలం లేదా వెంట్రుకలను పరీక్షిస్తారు. ఒక వ్యక్తి ఊపిరితిత్తులు, గుండె మొదలైన సమస్యల కారణంగా మరణించినప్పుడు లేదా ఆసుపత్రిలో చేరినప్పుడు బీమా కంపెనీ పొగాకు కారణమా అని విచారిస్తుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి బీమా డబ్బును క్లెయిమ్ చేయలేకపోవచ్చు.