్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ప్రత్యేకమైన క్షణం. ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యం, ప్రమాదం లేదా వివాహం జరగకపోవడం వంటి సంఘటనలు ఈ సంతోషకరమైన సందర్భాన్ని పాడుచేస్తాయి. ప్రతి ఒక్కరూ వివాహ బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది వివాహానికి సంబంధించిన ఖర్చులను భరించడంలో మీకు సహాయపడుతుంది.
వివాహ బీమా అనేది వివాహ కార్యక్రమంలో కలిగే నష్టాలను కవర్ చేసే బీమా పాలసీ. ఈ పాలసీతో వివాహం కాని కారణంగా లేదా ప్రకృతి వైపరీత్యం లేదా ఇతర సంఘటనల కారణంగా కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయవచ్చు.
ఏదైనా కారణం చేత వివాహం వాయిదా అయినా, జరగకపోయినా.. బుకింగ్, అలంకరణ, ఆహారం మొదలైన వాటి కోసం అయ్యే ఖర్చులను ఈ బీమా కింద తిరిగి చెల్లించవచ్చు. వివాహం సమయంలో అగ్నిప్రమాదం, దొంగతనం లేదా ఇతర కారణాల వల్ల కలిగే ఆస్తి నష్టం కవర్ అవుతుంది. ఇది కాకుండా వివాహ సమయంలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా ఈ బీమా సాయం అందిస్తుంది. భూకంపం, వరదలు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది. వివిధ రకాల వివాహ బీమాలు వివిధ రకాల నష్టాలు కవర్ చేస్తాయి. మీ అవసరాలకు అనుగుణంగా వివాహ బీమాను కొనుగోలు చేయవచ్చు.
ముందుగా పెళ్లి మొత్తం ఖర్చును అంచనా వేయండి. తరువాత వివిధ బీమా కంపెనీల పాలసీలు, కవరేజీలను పోల్చండి. పాలసీని కొనుగోలు చేసే ముందు దాని నిబంధనలు, కవరేజీని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. మీరు బీమా పాలసీని ఆన్‌లైన్‌లో లేదా నమ్మకమైన ఏజెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ బీమాలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉగ్రవాద దాడులు, ఆత్మహత్య లేదా ఉద్దేశపూర్వక నష్టం వంటి కొన్ని సంఘటనలు ఈ బీమా కింద కవర్ కావు. వివాహానికి కనీసం 15 రోజుల ముందు బీమా పాలసీని కొనుగోలు చేయడం ముఖ్యం. ఏదైనా నష్టం జరిగితే వెంటనే బీమా కంపెనీకి తెలపండి. క్లెయిమ్ ఫారం, నష్టం వివరాలు, సంబంధిత రసీదులు వంటి అవసరమైన పత్రాలను సమర్పించండి. వివాహ బీమా అనేది వివాహ సమయంలో అనుకోని నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడేదిగా ఉంటుంది.