మ్యూచువల్​ ఫండ్​ సిప్​ని ప్రారంభించాలా? ఈ గైడ్​తో ఈజీగా చేసేయండి..-want to start a mutual fund sip here is a step by step guide ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మ్యూచువల్​ ఫండ్​ సిప్​ని ప్రారంభించాలా? ఈ గైడ్​తో ఈజీగా చేసేయండి..

మ్యూచువల్​ ఫండ్​ సిప్​ని ప్రారంభించాలా? ఈ గైడ్​తో ఈజీగా చేసేయండి..

Sharath Chitturi HT Telugu

మ్యూచువల్​ ఫండ్​ ఎస్​ఐపీ (సిప్​)ల ద్వారా ఇప్పుడు చాలా మంది భారతీయులు స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్​ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ జర్నీని ప్రారంభించాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

మ్యూచువల్​ ఫండ్​ సిప్​ని ఇలా ప్రారంభించండి..

ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న ఆయుధం ‘ఇన్వెస్ట్​మెంట్​’! ఈ విషయాన్ని గ్రహించిన అనేక మంది భారతీయులు ఇటీవలి కాలంలో తమ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించారు. ఈ ఇన్వెస్ట్​మెంట్స్​లో చాలా వరకు స్టాక్​ మార్కెట్​లోకి వెళుతున్నాయి. అయితే, షేర్ మార్కెట్ అస్థిరతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. సిప్​ ద్వారా చేసే పెట్టుబడి 'రూపాయి వ్యయ సగటు' (రూపీ కాస్ట్​ యావరేజింగ్​) ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఒక ఆస్తిని, అంటే స్టాక్స్‌ను, కొనుగోలు చేసే ఖర్చును సగటున తగ్గించుకోవడానికి సమర్థవంతమైన మార్గం.

ఉదాహరణకు, ఒక సెక్యూరిటీ రెండు నెలల కాలంలో రూ. 200 నుంచి రూ. 250 మధ్య ఐదు వేర్వేరు ధరల వద్ద అందుబాటులో ఉన్నప్పుడు.. అధిక ధర వద్ద (రూ. 250) కొనుగోలు చేసే ప్రమాదాన్ని నివారించి, ఈ రెండు నెలల్లో సిప్​ల ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా కొనుగోలు ఖర్చును సగటున తగ్గించుకోవచ్చు!

ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు పొందే అవకాశాన్ని పెంచుతుంది. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఎస్​ఐపీలను ఎంచుకోవచ్చు.

ఎస్​ఐపీలను ప్రారంభించడానికి అనుసరించాల్సిన స్టెప్స్​:

I. అకౌంట్​ ఓపెన్​ చేయండి:

మొదట, మీరు మ్యూచువల్ ఫండ్ హౌస్ లేదా గ్రో(Groww) లేదా జెరోధా (Zerodha) వంటి అగ్రిగేటర్ సంస్థలో అకౌంట్​ ఓపెన్​ చేయాలి. ఖాతా తెరవడానికి, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలి.

II. కొత్త లావాదేవీని ఎంచుకోండి:

మ్యూచువల్​ ఫండ్​ సిప్​ ఖాతా తెరిచిన తర్వాత, మీరు 'కొత్త లావాదేవీ' (New transaction) విభాగానికి వెళ్లవచ్చు. ఇక్కడ మీకు 'లమ్​సమ్' (Lumpsum), సిప్​-'SIP' అనే రెండు ఆప్షన్స్​ కనిపిస్తాయి. మీరు 'ఎస్ఐపీ'పై క్లిక్ చేయాలి.

III. కొత్త పథకాన్ని యాడ్​ చేసుకోండి:

తరువాత, మీరు Add a new scheme విభాగానికి వెళ్లాలి. ఇక్కడ మీరు ఎంచుకోవడానికి రెండు ఆప్షన్స్​ ఉంటాయి: ‘లమ్​సమ్’, 'సిప్​'. మీరు 'సిప్​'ని ఎంచుకోవాలి.

IV. పథకం- డబ్బును ఎంచుకోండి:

ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న పథకాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు మీరు పెట్టుబడి పెట్టదలిచిన మొత్తాన్ని నమోదు చేయాలి.

V. సిప్​ ప్రారంభ తేదీని ఎంచుకోండి:

తరువాత, మ్యూచువల్​ ఫండ్​ సిప్​ ప్రారంభ తేదీని ఎంచుకోవడానికి ఎంపిక వస్తుంది. మీరు నెలలో ఏ తేదీనైనా ఎంచుకోవచ్చు!.

VI. సిప్​ కాలపరిమితిని నిర్ణయించుకోండి:

సాధారణంగా, సిప్​ ముగింపు తేదీ డిసెంబర్ 31, 2099 అని డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే, మీరు వాయిదాల సంఖ్యను ఎంచుకోవడం ద్వారా లేదా చివరి తేదీని ఎంచుకోవడం ద్వారా మ్యూచువల్​ ఫండ్​ సిప్​ కాలపరిమితిని సులభంగా మార్చుకోవచ్చు.

VII. ఏఎంసీ ఆప్షన్స్​:

సాధారణంగా, ఏఎంసీ (అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీ) మీకు మూడు ఆప్షన్స్​ని అందిస్తుంది:

రద్దు చేసే వరకు మ్యూచువల్​ ఫండ్​ సిప్​ కొనసాగించడం.

వాయిదాల సంఖ్యను ఎంచుకోవడం.

నిర్దిష్ట తేదీ వరకు కొనసాగించడం. వీటిల్లో ఒకటి ఎంచుకోండి.

మీ మ్యూచువల్​ ఫండ్​ సిప్​ జర్నీని ప్రారంభించండి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా మ్యూచువల్​ ఫండ్​లో ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు, మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం