వోక్స్ వ్యాగన్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రణాళిక; దశలవారీగా 35 వేల మందికి లే ఆఫ్-volkswagen layoffs automakers plan to cut 35 thousand jobs on track ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వోక్స్ వ్యాగన్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రణాళిక; దశలవారీగా 35 వేల మందికి లే ఆఫ్

వోక్స్ వ్యాగన్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రణాళిక; దశలవారీగా 35 వేల మందికి లే ఆఫ్

Sudarshan V HT Telugu

వోక్స్ వ్యాగన్ సంస్థ వ్యయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి 35,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటికే వోక్స్ వ్యాగన్ బ్రాండ్ ఉద్యోగుల్లో 20,000 మందికి పైగా కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడానికి అంగీకరించారు.

వోక్స్ వ్యాగన్ లో లే ఆఫ్ (Reuters)

జర్మన్ ఆటోమొబైల్ పరిశ్రమపై కొనసాగుతున్న ట్రంప్ టారిఫ్ ల మధ్య కంపెనీ వ్యయ తగ్గింపు కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి జర్మనీలో 35,000 మంది ఉద్యోగులను తొలగించాలని గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ యోచిస్తున్నట్లు స్థానిక న్యూస్ పోర్టల్ బిల్డ్ మంగళవారం నివేదించింది.

20 వేల మందికి వాలంటరీ రిటైర్మెంట్

వోక్స్ వ్యాగన్ బ్రాండ్ కు చెందిన 20,000 మందికి పైగా కార్మికులు తమ కాంట్రాక్టులను త్వరగా ముగించడానికి అంగీకరించారని, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటున్నారని వోక్స్ వ్యాగన్ యొక్క వోల్ఫ్స్ బర్గ్ ప్రధాన కార్యాలయంలో వర్క్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఉటంకిస్తూ న్యూస్ పోర్టల్ నివేదిక తెలిపింది. వోక్స్ వ్యాగన్ ఆటోమొబైల్ జర్మన్ ప్లాంట్లలో ఉద్యోగ కోతలు కేంద్రీకృతమవుతాయని భావిస్తున్నారు. ఉద్యోగాల తగ్గింపును "ఆమోదయోగ్యమైన పద్ధతిలో" చేపట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

వోక్స్ వ్యాగన్ సెవెరెన్స్ ప్యాకేజీ

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఖర్చు తగ్గింపు చర్యతో ప్రభావితమైన ప్రతి ఉద్యోగికి వారి సర్వీస్ కాలం ఆధారంగా ప్యాకేజీ ఇవ్వాలని యోచిస్తోంది. కంపెనీ 400,000 డాలర్ల వరకు చెల్లించే అవకాశం ఉంది. ఏదేమైనా, మొత్తం తొలగింపు చెల్లింపులపై కంపెనీ ఎటువంటి సమాచారాన్ని అందించలేదని మంగళవారం కంపెనీ సిబ్బంది సమావేశాన్ని ఉటంకిస్తూ న్యూస్ పోర్టల్ నివేదించింది.

అప్రెంటిస్ షిప్ లకు కోత

ఉద్యోగాల కోతతో పాటు 2026 నుంచి ఏటా అందించే అప్రెంటిస్షిప్ల సంఖ్యను 1,400 నుంచి 600కు తగ్గించనుంది. భారీ తొలగింపులతో పాటు ఈ వ్యయ కోతలు జర్మన్ ఆటోమొబైల్ సంస్థకు ప్రతి సంవత్సరం కార్మిక వ్యయంలో దాదాపు 1.5 బిలియన్ యూరోలను ఆదా చేస్తాయని వార్తా నివేదిక తెలిపింది. స్వచ్ఛంద రాజీనామా మాత్రమే కాదు. వోక్స్ వ్యాగన్ కోర్ టీమ్ లోని దాదాపు 130,000 లేదా 13 లక్షల మంది ఉద్యోగులు పేమెంట్ ఫ్రీజ్ ను అంగీకరిస్తున్నారు. దీనిని రెండు దశల్లో కంపెనీ చేపట్టనుంది.

టారిఫ్ కష్టాలు

ట్రంప్ సుంకాల నేపథ్యంలో జర్మన్ ఆటోమోటివ్ పరిశ్రమ 2025 మేలో మరింత క్షీణించింది. "యుఎస్ టారిఫ్ ల చుట్టూ ఉన్న గందరగోళం జర్మనీలోని ఆటోమోటివ్ పరిశ్రమకు సమస్యలను కలిగిస్తోంది" అని ఐఫో సెక్టార్ స్పెషలిస్ట్ అనితా వోల్ఫ్ల్ చెప్పారు. ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో బలహీనమైన డిమాండ్, విదేశీ బ్రాండ్ల నుంచి గట్టి పోటీతో వాహన తయారీ సంస్థలు సతమతమవుతున్నాయి. దీంతో సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు వోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ లు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.