VI 5G launch: మార్చి నెలలో 5జీ లాంచ్ చేయనున్న వొడాఫోన్ ఐడియా; జియో, ఎయిర్ టెల్ కంటే 15 శాతం చౌకగా..
VI 5G launch: పోటీ దారులైన జియో, ఎయిర్ టెల్ ల కంటె కొంత ఆలస్యంగా భారతదేశంలో 5జీ సేవలను వొడాఫోన్ ఐడియా ప్రారంభిస్తోంది. ఈ మార్చి నెలలో 5 జీ సర్వీస్ లను వీఐ ప్రారంభించనుంది. అయితే, గణనీయమైన మార్కెట్ వాటా లక్ష్యంగా.. 5జీ టారిఫ్ లను అత్యంత తక్కువ ధరకే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Vodafone Idea 5G launch: వొడాఫోన్ ఐడియా (VI) తన 5జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవను ఈ ఏడాది మార్చిలో ప్రారంభించనుంది. మార్కెట్ వాటాను చేజిక్కుంచుకునే లక్ష్యంతో దూకుడు ధరల ప్రణాళికలతో వీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ఆఫర్ల కంటే ఈ వీఐ 5జీ ప్లాన్లు 15 శాతం చౌకగా ఉండొచ్చని ఎకనమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ల కలిగి ఉన్నాయి.
వీఐ ప్లాన్స్
వొడాఫోన్ ఐడియా (VI) కి ఈక్విటీ ఫండింగ్ లో రూ.24,000 కోట్ల మద్దతు ఉందని, ప్రభుత్వం ఇటీవల బ్యాంకు గ్యారంటీ ఆవశ్యకతను మాఫీ చేసిన తర్వాత మరో రూ.25,000 కోట్లను రుణంగా సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీఐ తన 17 ప్రాధాన్య సర్కిళ్లలో భారతదేశంలోని టాప్ 75 నగరాల్లో 5 జీని మొదట ప్రారంభించవచ్చని, భారీ డేటా-ఆధారిత జోన్లుగా ఉన్న పారిశ్రామిక హబ్ లను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక తెలిపింది. వొడాఫోన్ ఐడియా (VI) తన భారీ ప్రత్యర్థుల నుండి అధిక విలువ కలిగిన 5 జీ ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకర్షించడానికి డీలర్ కమీషన్లు, ప్రమోషనల్ ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉంది.
డీలర్ కమిషన్లు..
2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి, వీఐ డీలర్ కమీషన్ల కోసం సుమారు రూ .3,583 కోట్లు (లేదా అమ్మకాలలో 8.4%) ఖర్చు చేసిందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫరీస్ ను ఉటంకిస్తూ ఈటీ నివేదించింది. ఇదే సమయంలో జియో చేసిన రూ. 3,000 కోట్ల డీలర్ కమీషన్ల చెల్లింపు కంటే ఇది చాలా ఎక్కువ. ఇందుకోసం ఎయిర్ టెల్ (airtel) రూ.6,000 కోట్లు (లేదా అమ్మకాల్లో 4 శాతం) ఖర్చు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి జియో (jio), ఎయిర్టెల్ వరుసగా 148 మిలియన్లు, 105 మిలియన్ల 5జీ వినియోగదారులను కలిగి ఉన్నాయి. నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్ సంస్థలతో 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను వీఐ ఇటీవలే ముగించింది. మూడేళ్లలో 75,000 5జీ (5g technology) సైట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.