త్వరలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువేనని అంచనా!-vinfast vf3 small electric car launch soon in india expected price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  త్వరలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువేనని అంచనా!

త్వరలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువేనని అంచనా!

Anand Sai HT Telugu

భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లోకి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంట్రీ ఇవ్వనుంది. విన్‌ఫాస్ట్‌కు చెందిన వీఎఫ్3 ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది.

విన్‌ఫాస్ట్‌ వీఎఫ్3

వియత్నానికి చెందిన విన్‌ఫాస్ట్ ప్రముఖ ఆటోమేకర్‌గా అవతరించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వివిధ ద్విచక్ర వాహనాలు, కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ఈ కంపెనీ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. జనవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొన్ని కార్లను ప్రదర్శించింది. వాటిలో వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ దృష్టిని ఆకర్షించింది.

అక్కడి కస్టమర్లకు నచ్చింది

సరికొత్త విన్‌ఫాస్ట్‌ వీఎఫ్3 ఈవీ అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో గ్రాండ్ లాంచ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఫిబ్రవరిలో ఇండోనేషియా మార్కెట్లో విన్‌ఫాస్ట్‌ వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్లు అక్కడి కస్టమర్లకు నచ్చాయి. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చిన్న దేశమైనా కేవలం 2 నెలల్లోనే 400 యూనిట్ల కార్లు డెలివరీ అయ్యాయి.

మంచి రేంజ్

అంతర్జాతీయ మార్కెట్లో కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొత్త విన్‌ఫాస్ట్‌ వీఎఫ్3 ఈవీ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇది 18.64 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. పూర్తి ఛార్జ్ మీద 215 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు. ఇందులో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటారు అధిక హార్స్‌పవర్ అండ్ పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఆకట్టుకునే డిజైన్!

ఈ ఎలక్ట్రిక్ కారు చాలా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. దీనికి హెడ్‌లైట్లు, ఆకర్షణీయమైన బంపర్, Vని పోలి ఉండే టెయిల్‌గేట్ ఉన్నాయి. దీనికి 2-డోర్లు, 4-సీట్ల ఎంపిక కూడా ఉంది. కొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఈవీ వినూత్న స్టైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. దీనికి 10-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ పవర్ విండోలు లభిస్తాయి. ఇది ప్రయాణీకుల రక్షణ కోసం పలు ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

ధర అంచనా

కొత్త వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ బడ్జెట్ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర కూడా రూ.7.50 లక్షలు నుంచి వేరియంట్‌ను బట్టి రూ.10 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా. దాదాపు నానో అంత చిన్నగా ఉండే ఈ కారు.. ఎంజీ కామెట్, టాటా టియాగో ఈవీలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.