కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో రూ.9,000 కోట్ల మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంపై, తదనందర పరిణామాలపై మాల్యా స్పందించారు.
2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనమైందని మాల్యా స్పష్టం చేశారు. ‘‘2008 లో ఏం జరిగింది? లెహ్మన్ బ్రదర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మీరు విన్నారు కదా? అది భారత్ పై కూడా పెను ప్రభావం చూపింది" అని ఆయన అన్నారు. " ఆ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బులు ఆగిపోయాయి. ఆర్థిక రంగం దెబ్బతిన్నది. భారత రూపాయి విలువ కూడా దెబ్బతింది’’ అని వివరించారు.
2005 లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ త్వరలోనే లగ్జరీ సేవలకు ఖ్యాతిని పొందింది. కాని ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. ఆర్థికమాంద్యం కారణంగా ఏర్ లైన్స్ బిజినెస్ కుదేలయింది. ఈ పరిస్థితుల్లోనే తాను నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని మాల్యా వెల్లడించారు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను తగ్గించే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించానని మాల్యా వెల్లడించారు. 'నేను ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వెళ్లాను. మరియు నాకు సమస్య ఉందని చెప్పాను. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను కార్యకలాపాలను తగ్గించాలని, విమానాల సంఖ్యను తగ్గించాలని, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని, ఈ విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో తాను పనిచేయలేనని ఆయనకు వివరించాను’’ అని విజయ్ మాల్యా వివరించారు. అయితే, తన అభ్యర్థనను ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారని మాల్యా తెలిపారు. ". కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను తగ్గించవద్దని నాకు చెప్పారు. మీరు కొనసాగించండి. బ్యాంకులు మీకు మద్దతు ఇస్తాయి అని చెప్పారు. అలా మొదలైంది అంతా’’ అని మాల్యా వివరించారు.
ఆ తరువాత కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. తన అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. 2016లో భారత్ ను విడిచి పారిపోయిన మాల్యా అప్పటి నుంచి యునైటెడ్ కింగ్ డమ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనను భారత్ కు తీసుకువచ్చేందుకు న్యాయ పోరాటం కొనసాగుతోంది.
పాడ్ కాస్ట్ లో మాల్యాను 'చోర్' అని సంబోధించడం సరికాదని విజయ్ మాల్యా అన్నారు. తాను పరిస్థితుల కారణంగా పారిపోయాను కానీ, దొంగను కాదు అన్నారు. 'మార్చి (2016) తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. ఒప్పుకుంటాను. ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం భారతదేశం నుండి బయలుదేరి వెళ్లాను. కొన్ని కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే, పిలవండి. కానీ 'దొంగ' అనవద్దు. ఇక్కడ దొంగతనం ఎక్కడ జరిగింది’’ అని ప్రశ్నించారు.
భారతీయ బ్యాంకులకు తాను చెల్లించాల్సిన రూ.6,200 కోట్లను ఇప్పటికే పలు రెట్లు రికవరీ చేసినట్లు మాల్యా కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. తన నుంచి, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్, ప్రస్తుతం లిక్విడేషన్లో ఉంది), ఇతర అనుబంధ పక్షాల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాలను పూర్తిగా లెక్కించాలని కోరారు.
సంబంధిత కథనం