Video, audio calling on Twitter: త్వరలో ట్విటర్ లో ఆడియో, వీడియో కాలింగ్ ఫెసిలిటీ; కానీ..
Video, audio calling on Twitter: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) లో త్వరలో ఆడియో, వీడియో కాలింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. అయితే, మొదట ఐ ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇటీవల ట్విటర్ (Twitter) పేరు ఎక్స్ (X) గా మారిన విషయం తెలిసిందే.
Video, audio calling on Twitter: ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిననాటి నుంచి ట్విటర్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగ, యాజమాన్యాల మధ్య విబేధాలు తలెత్తాయి. ట్విటర్ లోగోను కూడా మస్క్ ఎక్స్ (X) గా మార్చారు. ఎక్స్ లో కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో ఆడియో, వీడియో కాలింగ్ (Video, audio calling) ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆడియో, వీడియో కాలింగ్
వినియోగదారులకు మరింత దగ్గరవ్వడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ట్విటర్ కు జత చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించారు. అయితే, మొదట ఈ సదుపాయం ఐ ఫోన్ యూజర్లకు మాత్రమే కల్పించనున్నారు. ఐ ఫోన్ ఫేస్ టైమ్ తరహాలో ఈ ఫీచర్ ఉంటుంది. ఆ తరువాత క్రమంగా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫెసిలిటీని అందించాలని ఆలోచిస్తున్నారు. అయితే, ఈ సదుపాయాన్ని వినియోగదారులకు ఉచితంగా అందిస్తారా? లేక చార్జ్ చేస్తారా? అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. మొదట ట్విటర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికే ఇది అందించే ఆలోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ నంబర్ అవసరం లేదు..
ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయానికి సంబంధించిన వివరాలను ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ఐఓస్, ఆండ్రాయిడ్, మ్యాక్, పీసీ ల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ట్విటర్ ద్వారా ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి ఫోన్ నంబర్ అవసరం లేదని వెల్లడించారు. ట్విటర్ లో ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయం మస్క్ వెల్లడించలేదు. అయితే, త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
ఎన్ క్రిప్షన్ ఎలా?
ఫోన్ నంబర్ లేకుండా అందించే సదుపాయం కావడంతో సెక్యూరిటీకి సంబంధించిన అనుమానాలు యూజర్లలో తలెత్తుతున్నాయి. ఎన్ క్రిప్షన్ కు సంబంధించిన డౌట్ ను ఒక యూజర్ ఇప్పటికే మస్క్ ముందు ఉంచారు. త్వరలో ట్విటర్ ఆడియో, వీడియో కాలింగ్ ల్లో కూడా ఎన్ క్రిప్షన్ ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తామని మస్క్ తెలిపారు. అయితే, ఎన్ క్రిప్షన్ కన్నా కాల్ క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు.