ఇండియాలో సరికొత్త, ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది హీరో మోటాకార్ప్కి చెందిన విడా. జులై 1న, విడా వీఎక్స్2 పేరు ఈ-స్కూటర్ని ఆవిష్కరించనుంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వీ2 ఈ-స్కూటర్‌కి ఇది అఫార్డిబుల్ వర్షెన్ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..
విడా ఇటీవలే విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం.. ఈ వీఎక్స్2 డిజైన్ 2024 ఈఐఏఎంసీలో ప్రదర్శించిన విడా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 మోడల్‌ను పోలిన డిజైన్‌తో వస్తుంది. అయితే, ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ముందు, వెనుక భాగాలలో ఎల్‌ఈడీ లైటింగ్ ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లో పొందుపరిచిన ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్ ఉంటాయి. అంతేకాకుండా, ఫ్లాట్ సీటు, హ్యాండిల్‌బార్‌ల వద్ద ప్రాథమిక టోగుల్ బటన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉంటాయి.
ఇది తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి, విడా కొన్ని ఖర్చులను తగ్గించే చర్యలతో వస్తుంది. ఈ ఈవీలో డిస్క్ బ్రేక్‌లకు బదులుగా రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. అయితే, వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ వేరియంట్లలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉండే అవకాశం ఉంది. టచ్‌స్క్రీన్ కాకుండా, చిన్న డిజిటల్ డిస్‌ప్లేతో పాటు ఫిజికల్ బటన్లు ఉంటాయి. అలాగే, కీలెస్ లేదా మొబైల్ యాప్ ఆధారిత ఇగ్నిషన్ సిస్టమ్‌కు బదులుగా సంప్రదాయ కీ- ఇగ్నిషన్ సిస్టెమ్ ఉంటుంది.
విడా వీఎక్స్2 కూడా విడా వీ2 మోడల్‌లో ఉన్న మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌నే కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. విడా వీఎక్స్2లో 2.2 కేడబ్ల్యూహెచ్ నుంచి 3.4 కేడబ్ల్యూహెచ్ వరకు బహుళ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే VX2 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రేంజ్.. బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఈవీ సులభంగా ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవడానికి లేదా బ్యాటరీలను స్వాప్ చేయడానికి వీలుగా రిమూవెబుల్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది.
విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే, విడా వీఎక్స్2 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (BaaS)' మోడల్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ మోడల్ కొనుగోలుదారులకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది బ్యాటరీలను విడిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల వినియోగదారులు కిలోమీటరు వినియోగాన్ని బట్టి కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ ఖర్చు చెల్లించవచ్చు. BaaS మోడల్‌ను ఎంచుకునే వినియోగదారులు ఈ ఈవీని సుమారు రూ. 70,000 (ఎక్స్-షోరూమ్) కు కొనుగోలు చేయగలరని అంచనా వేస్తున్నారు.
లాంచ్ తర్వాత ఈ మోడల్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1 ఎయిర్, బజాజ్ చేతక్ వంటి వాటితో పోటీ పడుతుంది.
సంబంధిత కథనం