US carmaker Ford to cut jobs: ఆర్థిక మాంద్యం తరుముకు వస్తున్న నేపథ్యంలో చేపడ్తున్న పొదుపు చర్యల్లో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఉద్యోగుల తొలగింపు (LAY OFF) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆమెజాన్, ట్విటర్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర మేజర్ టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపు (LAY OFF) చేపట్టాయి.
ఇప్పటికే అమెరికాలో తన ఉద్యోగుల సంఖ్యను ఫోర్డ్ (Ford Motor Co) తగ్గించుకుంది. తాజాగా యూరోప్ లోని తన వర్క్ ఫోర్స్ ను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. యూరోప్ లోని పలు దేశాల్లో ఉన్న తమ ఉద్యోగుల్లో 3200 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాల ఉత్పత్తిని తగ్గించి, విద్యుత్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టే లక్ష్యంతో ఫోర్డ్ (Ford Motor Co) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఎక్కువగా జర్మనీ ఉద్యోగులకు ఉంది. జర్మనీలోని ప్రొడక్ట్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లోని ఉద్యోగుల సంఖ్యను రీస్ట్రక్చర్ చేయాలని ఫోర్డ్ భావిస్తోంది. ఈ నిర్ణయంతో జర్మనీలోని సుమారు 65% ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో జర్మనీలోని కలోన్ లో ఉన్న ఫోర్డ్ కార్ల ఉత్పత్తి ఫాక్టరీకి సంబంధించిన IG Metall యూనియన్ కార్మికులు సోమవారం సమావేశమయ్యారు. జర్మనీలోని సార్లూయిస్ ప్లాంట్ లో ఫోర్డ్ కు 4600 మంది ఉద్యోగులున్నారు. అక్కడ ప్రధానంగా రూపొందే ఫోకస్ మోడల్ కారు ఉత్పత్తిని నిలిపేయాలని ఫోర్డ్ నిర్ణయించింది. దాంతో, అక్కడి ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికాలోని తమ ఉద్యోగుల్లో సుమారు 3000 మందిని ఫోర్డ్ ఇప్పటికే తొలగించింది. ఖర్చులను తగ్గించుకుని, లాభాలను పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ వెల్లడించారు. మొత్తంగా 3 బిలియన్ డాలర్లను సేవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంప్రదాయ వాహనాల అమ్మకాల ద్వారా లభించిన లాభాలను విద్యుత్ వాహనాల పరిశోధన, అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ‘‘కొన్ని విభాగాల్లో అవసరమైన సంఖ్యకన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుత అవసరాలకు సరిపోని నైపుణ్యాలున్న ఉద్యోగులున్నారు. మార్పు అవసరమైన జాబ్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ రీస్ట్రక్చర్ చేయాల్సి ఉంది’’ ఆయన స్పష్టం చేశారు.