అదానీ గ్రూప్‌ను షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత.. ఫౌండర్ నాథన్ అండర్సన్ ప్రకటన
Hindenburg Research : అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేస్తున్నట్టుగా దాని వ్యవస్థాపకుడు ప్రకటించారు. ఈ సంస్థ అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అదానీ గ్రూపును కుదిపేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దుకాణం మూతపడింది. సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంస్థను మూసివేయాలని నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు తన ప్రయాణం, పోరాటాలు, విజయాల గురించి భావోద్వేగంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాము చేస్తున్న ఆలోచనలు పూర్తి కాగానే దాన్ని మూసేయాలనేది తమ ప్రణాళిక అని అండర్సన్ ఆ నోట్ లో పేర్కొన్నారు.
సామ్రాజ్యాలను కదిలించాం
2017లో ప్రారంభించినప్పటి నుండి హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. మోసం, అవినీతి, దుర్వినియోగాన్ని బహిర్గతం చేయడంలో పేరు సంపాదించింది. సంస్థ సాధించిన విజయాల గురించి అండర్సన్ ఇలా అన్నారు. 'మేం కొన్ని సామ్రాజ్యాలను కదిలించాం, వాటిని కదిలించాల్సిన అవసరం ఉందని మేం భావించాం. అందులో అదానీ గ్రూప్ ఒకటి. నా కుటుంబం, స్నేహితులు, 11 మంది అంకితభావంతో కూడిన బృందం హిండెన్‌బర్గ్‌ను ఆర్థిక దర్యాప్తు కేంద్రంగా మార్చింది.' అని కొనియాడారు.
అదానీ గ్రూప్ టార్గెట్
40 ఏళ్ల అండర్సన్ 2023 జనవరిలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీంతో కొద్ది రోజుల్లోనే అదానీ భారీగా నష్టపోయారు. స్టాక్స్ పడిపోయాయి. డోర్సీకి చెందిన బ్లాక్ ఇంక్, ఐకాన్‌కు చెందిన ఇకాన్ ఎంటర్‌ప్రైజెస్‌పై కూడా అండర్సన్ నివేదికలు ప్రచురించారు. అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక గ్రూపును అస్థిరపరచడానికి మాత్రమే కాకుండా భారతదేశాన్ని రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయడానికి ఉద్దేశించిందని గౌతమ్ అదానీ అప్పట్లో అన్నారు.
సంచనల ఆరోపణలు
అదానీ గ్రూప్ కృత్రిమంగా షేర్లను పెంచుకుంటోందని, స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడుతుందోని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ చాలా నష్టపోయింది. మార్కెట్ విలువ కోట్లలో పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ ఖండించినా... చాలా రోజులపాటు నష్టాలు మాత్రం ఆగలేదు. అయితే తర్వాత కూడా చాలాసార్లు ఆరోపణు చేసింది హిండెన్‌బర్గ్. కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాగే పలు సంస్థలపై ఆర్థిక పరిశోధనలు చేసి ఆరోపణలు చేయడంతో సదరు కంపెనీల షేర్లు పడిపోవడం.. షార్ట్ సెల్లింగ్ ద్వారా లభాలు ఆర్జించడం చేసేది హిండెన్‌బర్గ్.
వ్యక్తిగత నిర్ణయంతోనే
ఎలాంటి ఆర్థిక నేపథ్యం లేకుండా ఈ సంస్థను ప్రారంభించినట్లు అండర్సన్ తెలిపాడు. అప్పట్లో ఆర్థిక వనరులు గానీ, పారిశ్రామిక ప్రపంచంతో సంబంధం గానీ లేవు. 'నాకు సంప్రదాయ ఆర్థిక నేపథ్యం లేదు. నా బంధువులెవరూ ఈ రంగంలో లేరు. ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నేను స్మార్ట్ సేల్స్ పర్సన్ ని కాదు.' అని నాథన్ అండర్సన్ అన్నారు.
హిండెన్‌బర్గ్‌ను మూసివేయాలనే నిర్ణయం చాలా వ్యక్తిగత నిర్ణయమని అండర్సన్ స్పష్టం చేశారు. ఏ విషయం లేదు, ప్రమాదం లేదు, సమస్య లేదు.. వ్యక్తిగత నిర్ణయంతోనే సంస్థను మూసివేస్తున్నట్టుగా తెలిపారు.