యూపీఐపై బిగ్ అప్డేట్.. ట్రాన్సాక్షన్ ఛార్జీలపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే-upi transactions above 3000 big update on upi what did the government say on transaction charges ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యూపీఐపై బిగ్ అప్డేట్.. ట్రాన్సాక్షన్ ఛార్జీలపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే

యూపీఐపై బిగ్ అప్డేట్.. ట్రాన్సాక్షన్ ఛార్జీలపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే

Anand Sai HT Telugu

రూ.3,000 లేదా రూ.5,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం ఛార్జీలు విధించవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.

యూపీఐ

యూపీఐ లావాదేవీలపై MDR(మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేయబడుతుందనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలించడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తున్నారనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పింది.

పెద్ద వ్యాపారులకు మాత్రమే

యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రూ.3,000 లేదా రూ.5,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం ఛార్జీలు విధించవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకోసం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టవచ్చని వైరల్ అయింది. వాస్తవానికి పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సు మేరకే ఈ క్లెయిమ్ చేశారు. పెద్ద వ్యాపారులకు మాత్రమే యూపీఐపై 0.3 శాతం ఎండీఆర్ ప్రారంభించాలని కౌన్సిల్ ప్రతిపాదించినట్లు తెలిసింది.

ప్రస్తుతం రూపే కాకుండా ఇతర క్రెడిట్, డెబిట్ కార్డులపై 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఎండీఆర్ వసూలు చేస్తున్నారు. ఎండీఆర్ అనేది ఒక కస్టమర్ వ్యాపారికి చెల్లించినప్పుడు బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే రుసుము. ఈ రుసుమును సర్వీస్ ఆపరేటింగ్ కాస్ట్ గా వసూలు చేస్తారు.

వారికి యూపీఐ చెల్లింపు వ్యవస్థ

సెక్యూరిటీస్ మార్కెట్లో ఆర్థిక లావాదేవీల భద్రత, ప్రాప్యతను మెరుగుపరచడానికి ఇన్వెస్టర్ల నుండి డబ్బు వసూలు చేసే రిజిస్టర్డ్ మధ్యవర్తులందరికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థను తప్పనిసరి చేసినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బుధవారం తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో అనేక నమోదు చేయని సంస్థలు మోసపూరిత మార్గాల ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

విశ్వాసాన్ని పెంచేందుకు

అక్టోబర్ 1, 2025 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ సిస్టమ్(యూపీఐ) పేమెంట్ సిస్టమ్ అమల్లోకి వస్తుందని సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే విలేకరులకు తెలిపారు. రిజిస్టర్డ్ మధ్యవర్తులలో స్టాక్ బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు, డిపాజిటరీలు, పెట్టుబడి సలహాదారులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు ఉన్నారు. ఈ మధ్యవర్తులు పెట్టుబడిదారులకు, ఫైనాన్షియల్ మార్కెట్లలోని వివిధ సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారు. మోసపూరిత గుర్తింపు ముప్పును నివారించడానికి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే ప్రయత్నంలో, మార్కెట్ రెగ్యులేటర్ పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేసే రిజిస్టర్డ్ మధ్యవర్తులందరికీ కొత్త యూపీఐ తప్పనిసరి చేసింది.

సెబీ చెక్

ఇన్వెస్టర్ల సాధికారత కోసం మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ చెక్' అనే కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త టూల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా యూపీఐ ఐడీని నమోదు చేయడం ద్వారా గుర్తింపును ధృవీకరించడానికి, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి రిజిస్టర్డ్ మధ్యవర్తి బ్యాంక్ వివరాలను ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి సెబీ జనవరిలో సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.