UPI New Rule : యూపీఐలో కొత్త రూల్.. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఐడీలు ఫిబ్రవరి 1 నుంచి పని చేయవు
UPI New Rule : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఫిబ్రవరి 1 నుండి యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్ తీసుకువస్తుంది. కొన్ని రకాల ట్రాన్సాక్షన్ ఐడీలతో జరిగే లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయని స్పష్టం చేసింది.
యూపీఐ చెల్లింపులకు సంబంధించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి రోజువారీ జీవితంలో అవసరమైన పాలు, పెరుగు, కూరగాయలు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి చెల్లింపులు చేస్తారు. ఫిబ్రవరి 1 నుండి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీల్లో చెల్లింపుల విషయంలో పెద్ద మార్పు వస్తుంది.

స్పెషల్ క్యారెక్టర్స్ చెల్లవు
ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు/చిహ్నాలతో కూడిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను ఆమోదించబోమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి జనవరి 9న ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం యూపీఐ లావాదేవీ ఐడీని సృష్టించేటప్పుడు అక్షరాలు, సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రత్యేక అక్షరాలున్న ట్రాన్సాక్షన్ ఐడీని అంగీకరించదు.
అమౌంట్ పంపినా..
ఇలాంటి ప్రత్యేక చిహ్నాలు ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలకు మీరు అమౌంట్ పంపినా అవి తిరస్కరణకు గురవుతాయి. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో పాల్గోనే సంస్థలు, వ్యక్తులు ఈ మార్పు ప్రకారం ట్రాన్సాక్షన్ ఐడీలను సరైన ఫార్మాట్‌లోకి మార్చుకోవాలి. యూపీఐ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక అక్షరాలు, సింబల్స్‌లాంటి ట్రాన్సాక్షన్ ఐడీలను ఇకపై అనుమతించరు.
పెరుగుతున్న లావాదేవీలు
ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలతో ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ లావాదేవీలు యూపీఐ ద్వారా ఆమోదించబడవని ఎన్పీసీఐ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా యూపీఐ చెల్లింపు వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. డిసెంబర్ 2024 గణాంకాల ప్రకారం యూపీఐ స్వీకరించే, చెల్లించే లావాదేవీల సంఖ్య 16.73 బిలియన్లకు చేరుకుంది.
అక్షరాలు, నెంబర్లు మాత్రమే
ఎన్పీసీఐ సర్క్యులర్ ప్రకారం.. స్పెషల్ క్యారెక్టర్లతో ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలు ఫిబ్రవరి 1 నుంచి పని చేయవు. ఇకపై అక్షరాలు, నెంబర్లు మాత్రమే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీకి వాడాల్సి ఉంటుంది. స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను క్లోజ్ చేస్తారు. ఇప్పటికే ఎన్పీసీఐ ఏడాది నుంచి వినియోగంలో లేని ఐడీలను తొలగిస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫాలో కావాల్సి ఉంటుంది.