UPI limit increased: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్స్ రోజువారీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు; కానీ..
UPI limit increased: డిజిటల్ పేమెంట్ విధానం దాదాపు నిత్యావసరంగా మారిన పరిస్థితుల్లో యుపిఐ లావాదేవీ పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, అన్ని లావాదేవీలకు ఇది వర్తించదని ఆర్బీఐ వెల్లడించింది.
UPI limit increased: ఇక రోజువారీ యూపీఐ పేమెంట్స్ పరిమితిని పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇప్పటి వరకు వినియోగదారులు రోజుకు రూ .1 లక్ష వరకు మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ కొత్త ఆదేశాల ప్రకారం, ఇక రోజువారీ యూపీఐ చెల్లింపుల పరిమితి రూ .5 లక్షల వరకు పెంచారు.
పన్ను చెల్లింపులకు మాత్రమే..
అయితే, ఈ యూపీఐ చెల్లింపు పరిమితి ఆదాయ పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ షరతు విధించింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ని ఎక్కువగా ఉపయోగిస్తుండడం వల్ల ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులు సకాలంలో పన్ను చెల్లిస్తారని భావిస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లించే పన్నుకు సాధారణంగా ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని గమనించాలి. యూపీఐ పరిమితిని ఆర్బీఐ (RBI) పెంచడం (UPI limit increased) ఇదే తొలిసారి కాదు. విద్యా సంస్థలు, ఆసుపత్రులతో సహా కొన్ని చెల్లింపులకు యూపీఐ పరిమితిని గత ఏడాది చివర్లో ఆర్బీఐ రూ .5 లక్షలకు పెంచింది.
ప్రస్తుతం 1 లక్ష మాత్రమే..
"ప్రస్తుతం, అధిక లావాదేవీ పరిమితులు ఉన్న కొన్ని కేటగిరీల చెల్లింపులకు మినహా యూపీఐ (UPI) లావాదేవీ పరిమితి రూ .1 లక్ష గా ఉంది. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని తాజాగా ఆర్బీఐ నిర్ణయించింది. దీనివల్ల యూపీఐ ద్వారా వినియోగదారుల పన్ను చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఈ కేటగిరీలకు అధిక పేమెంట్ పరిమితి
ఎన్పీసీఐ (NPCI) ప్రకారం, సాధారణ ఉపయోగం కోసం యుపిఐ లావాదేవీ రోజువారీ పరిమితి ఇప్పటికీ రూ .1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్స్, కలెక్షన్స్, ఇన్సూరెన్స్, ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ వంటి యూపీఐ (UPI) లోని కొన్ని నిర్దిష్ట కేటగిరీల లావాదేవీలకు మాత్రం.. రోజువారీ లావాదేవీ పరిమితి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అలాగే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) లో, రిటైల్ డైరెక్ట్ స్కీమ్ లో ఒక్కో లావాదేవీకి పరిమితి రూ.5 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, అనధికార సంస్థలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ లెండింగ్ యాప్స్ పబ్లిక్ రిపాజిటరీని కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిపాదించారు.