ూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలాంటి యూపీఐ సేవల్లో అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. చెల్లింపులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ సమస్య మొదలైందని అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ నివేదించింది. రాత్రి 7 గంటలకు అత్యధికంగా 913 ఫిర్యాదులు నమోదయ్యాయి. యూపీఐ సేవలు నిలిచిపోవడం ఈ నెలలో ఇది మూడోసారి. అయితే ఇప్పుడు ఈ సర్వీసులు పనిచేయడం ప్రారంభించాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య యూజర్లు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.
డౌన్ డిటెక్టర్ ప్రకారం, సమస్యను ఎదుర్కొంటున్న 31 శాతం మంది చెల్లింపులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. 47 శాతం మంది నగదు బదిలీలో, 21 శాతం మంది కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేమెంట్ ఫెయిల్యూర్ లేదా పేమెంట్ ఆలస్యం కావడంపై దేశవ్యాప్తంగా యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. యాప్ సమస్యలను ఎదుర్కొంటోందని పేటీఎం యూజర్లకు ఎర్రర్ మెసేజ్ చూపించగా, గూగుల్ పే, ఫోన్ పే కూడా ఇలాంటి సమస్యలను నివేదిస్తున్నాయి.
ప్రతిరోజూ కోట్లాది మంది వినియోగదారులు చెల్లింపులు చేయడానికి యూపీఐని ఉపయోగిస్తారు. రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐపై ఆధారపడే చాలా మంది వ్యాపారులు, వినియోగదారులకు ఈ ఆకస్మిక అంతరాయం అసౌకర్యాన్ని కలిగించింది.
గత నెలలో కూడా యూపీఐ సిస్టమ్‌లో సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సమస్యకు కారణం బ్యాంక్ నుంచి వచ్చిన అనేక ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ అభ్యర్థనలు అని పేర్కొంది. ఈ అభ్యర్థనలతోనే సిస్టమ్‌పై ఒత్తిడి తెచ్చి డౌన్ చేశాయని తెలిపింది.
భారతదేశంలో యూపీఐ వాడకం రికార్డులు బద్దలు కొడుతోంది. యూపీఐ ఫిబ్రవరిలో 16.11 బిలియన్ల నుంచి మార్చిలో 18.3 బిలియన్లకు పైగా లావాదేవీలకు చేరుకుంది. ఈ లావాదేవీల విలువ రూ.24.77 లక్షల కోట్లకు చేరుకోవడం డిజిటల్ చెల్లింపులపై ఆధారపడటాన్ని ప్రతిబింబిస్తోంది.