Upcoming Tata Cars : సేఫ్టీలో సూపర్, బడ్జెట్ చూస్తే బెటర్.. రూ.10 లక్షలలోపే టాటా నుంచి కొత్త కార్లు!
Upcoming Tata Cars : టాటా కార్లకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సేఫ్టీ పరంగా చూసుకున్నా.. ఈ కార్లు బాగుంటాయి. త్వరలో ఈ కంపెనీ నుంచి అప్‌డేటెడ్ వెర్షన్ కార్లు రానున్నాయి. బడ్జెట్ ధరలో లాంచ్ అవనున్నాయి.
బడ్జెట్ ధరలో కారు కొనాలని చూస్తుంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదేమో. టాటా మోటార్స్ కొత్త ఏడాదిలో పది లక్షల రూపాయలకంటే తక్కువ ధరతో మూడు కొత్త కార్లను విడుదల చేయాలని అనుకుంటోంది. ఈ కార్ల ప్రారంభ ధర రూ.5-6 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ జాబితాలో అప్‌డేట్ చేసిన టాటా పంచ్, ఫేస్‌లిఫ్టెడ్ టియాగో, టిగోర్ ఉన్నాయి. నివేదికల ప్రకారం జనవరి 17 నుండి ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా టియాగో, టాటా టిగోర్‌లను ఆవిష్కరించవచ్చు.
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్
కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఈ సంవత్సరం విడుదల కావొచ్చు. దీని ఎక్స్‌టీరియర్‌లో మార్పులు కనిపిస్తాయి. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, రేడియేటర్ గ్రిల్, బంపర్, అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్స్ ఇవ్వవచ్చు. టియాగో హ్యాచ్‌బ్యాక్ 5 సీట్ల ఆప్షన్‌లో మాత్రమే ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. దీని ఇంజన్‌లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కొత్త టాటా టియాగో ప్రారంభ ధర రూ. 5 లక్షలు ఎక్స్ షోరూమ్ ఉండొచ్చు.
టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్
టిగోర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ సంవత్సరం విడుదల కానుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లను రావొచ్చు. ప్రారంభ ధర దాదాపు రూ.6 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్స్ ఇందులో ఇస్తారేమో. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ ఈ సంవత్సరం కొత్త అవతార్‌లో పంచ్‌ను విడుదల చేయనుంది. ఇది మైక్రో ఎస్‌యూవీ. రాబోయే కొత్త కారులో పంచ్ ఎలక్ట్రిక్ వంటి డిజైన్‌ను చూడవచ్చు. దీనికి కొత్త గ్రిల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ఇవ్వవచ్చు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.