ఎర్టిగా, ఇన్నోవాకు పోటీగా మార్కెట్‌లోకి మూడు 7 సీటర్ కార్లు.. బడ్జెట్ ధరలోనే
7 Seater Cars : భారత మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా ఈ మోడల్ కార్లను విడుదల చేస్తు్న్నాయి. ఈ సెగ్మెంట్‌లో మరో మూడు కార్లు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

కొన్ని సంవత్సరాలుగా 7 సీటర్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కార్లలో స్థలం ఎక్కువగా ఉంటుంది. ఏడుగురు చాలా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పెద్ద బూట్ స్పేస్ కూడా ఉంటుంది. మారుతి ఎర్టిగాకు ఈ సెగ్మెంట్లో అత్యధిక డిమాండ్ ఉంది. అదే సమయంలో మహీంద్రా స్కార్పియో, మహీంద్రా బొలెరో, కియా కారెన్స్, మారుతి ఈకో, టయోటా ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. పలు కంపెనీలు ఇప్పుడు ఈ విభాగంలో కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. రాబోయే కార్ల గురించి తెలుసుకోండి.
నిస్సాన్ కాంపాక్ట్ ఎమ్‌పీవీ
నిస్సాన్ ఇండియా కొత్త ఎంట్రీ లెవల్ ఎమ్‌పీవీతో తన పోర్ట్ ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ మోడల్ మాగ్నైట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలాంటి డిజైన్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ భిన్నంగా కనిపిస్తుంది. దీని ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్, ఇంజన్ సెటప్ కూడా మాగ్నైట్ నుండి రావొచ్చు. కొత్త నిస్సాన్ కాంపాక్ట్ ఎమ్‌పీవీలో 1.0 లీటర్, 3-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 71 బిహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 7 సీటర్ ఫ్యామిలీ కారు ధర సుమారు రూ.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
కియా ఈవీ
కియా ఇండియా సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ)ను భారత మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో కారెన్స్ ఈవీ, సిరోస్ ఈవీ ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లు 2025 ద్వితీయార్థంలో రోడ్లపైకి రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 2026 నాటికి 50,000 నుంచి 60,000 యూనిట్ల అమ్మకాలను సాధించాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే కియా కారెన్స్ ఈవీ ధర కూడా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీని వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కియా కారన్స్ కు భారత మార్కెట్లో మంచి రెస్పాన్స్ వస్తోందని నమ్ముతున్నారు.
మారుతి కాంపాక్ట్ ఎమ్‌పీవీ
మారుతి సుజుకి జపాన్-స్పెక్ స్పెసియా ఆధారంగా కొత్త మినీ ఎమ్‌పీవీని తీసుకురావచ్చు. ఇది సబ్-4 మీటర్ల ఎమ్‌పీవీ అని, ఇది బ్రాండ్ కొత్త జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉందని నివేదికలు ఉన్నాయి. స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్‌కు శక్తినిచ్చే మోటార్ ఇది. అయితే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న మారుతి సుజుకి సొంత స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో గ్యాసోలిన్ యూనిట్‌ను అందించవచ్చు.