Upcoming 7 Seaters : వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్న 7 సీటర్ ఎస్‌యూవీ కార్లు!
Upcoming 7 Seaters : 2025లో కొన్ని 7 సీటర్ కార్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇవి ఫ్యామిలీకి బాగా సూట్ అయ్యే ఎస్‌యూవీలు. ఆ లిస్టులో ఏమున్నాయో ఓసారి చూసేయండి..
2025 కొత్త సంవత్సరానికి దగ్గర అవుతున్నాం. కొత్త ఏడాదిలోనూ ఆటోమెుబైల్ మార్కెట్‌లో చాలా వాహనాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న కొత్త 7 సీటర్ ఎస్‌యూవీల గురించి చూద్దాం.. ఇందులో గ్రాండ్ విటారా 7-సీటర్ నుండి టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఉన్నాయి.
7 సీటర్ మారుతి గ్రాండ్ విటారా
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఇంజన్‌తో మార్కెట్‌లో ఉంది. మంచి కస్టమర్ బేస్‌ను పొందింది. అయితే దీనితో కంపెనీ ప్రస్తుతం ఉన్న 5-సీటర్ వెర్షన్ ఆధారంగా 7 సీటర్ మోడల్‌ను పరిచయం చేస్తుంది. ఇది భారతీయ రోడ్లపై పరీక్ష సమయంలో కూడా కనిపించింది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ అప్‌డేట్‌లతో ఇది మునుపటి కంటే మరింత విశాలంగా ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా మాదిరిగానే ఉండబోతోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న గ్రాండ్ విటారా తేలికపాటి, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది. 7 సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2025 ద్వితీయార్థంలో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు.
మహీంద్రా ఎక్స్ఈవీ 7ఈ
మహీంద్రా ఎక్స్ఈవీ 7ఈ కూడా మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది ఇటీవల ప్రారంభించిన XEV 9e నుండి అనేక విషయాలను పొందవచ్చు. అయితే రేంజ్, మోటార్ వంటి ఇతర సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
7 సీటర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
కొత్త 7 సీటర్ గ్రాండ్ విటారా తరహాలో అర్బన్ క్రూయిజర్ కూడా మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. రెండు వాహనాలు ఫీచర్లు, మెకానికల్స్ పరంగా ఒకే విధంగా ఉండబోతున్నాయి. అయితే రీబ్రాండింగ్ కోసం, దాని వెలుపలి భాగం కొద్దిగా మార్చే అవకాశం ఉంది. 7 సీటర్ గ్రాండ్ విటారా మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత 7 సీటర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ చూడవచ్చు.
టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్
టయోటా తన ఫార్చ్యూనర్‌ను హైబ్రిడ్ ఇంజన్‌తో త్వరలో భారత మార్కెట్‌లో పరిచయం చేయనుంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌లలో విక్రయంలో ఉన్న ఫార్చ్యూనర్ హైబ్రిడ్ 2.8-లీటర్ డీజిల్ ఇంజన్, 48-వోల్ట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. తక్కువ ఉద్గారాలతో ఇది మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.