Union Budget 2025: సాధారణంగా వారాంతాలైన శని, ఆదివారాలు భారతీయ స్టాక్ మార్కెట్లు మూసివేసి ఉంటాయి. ఆ రెండు రోజులు ట్రేడింగ్ ఉండదు. కానీ, ఈ శనివారం, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. మరి, ఆ రోజు స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కోసం తెరిచి ఉంటాయా?
ఫిబ్రవరి 1వ తేదీ, శనివారం స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయా? అనే విషయంపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వివరణ ఇచ్చింది. ఎన్ఎస్ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 వ తేదీ, శనివారం, స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కోసం తెరిచి ఉంటాయి. ఆ రోజు ట్రేడింగ్ సమయం ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉంటుంది. సాధారణంగా వారాంతాల్లో క్లోజ్ అయ్యే స్టాక్ మార్కెట్లు (stock market) అప్పుడప్పుడు కేంద్ర బడ్జెట్ వంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తాయి.
గతంలో, 2020 ఫిబ్రవరి 1, 2015 ఫిబ్రవరి 28 న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాక్ మార్కెట్లు తెరిచి ఉన్నాయి. బడ్జెట్ సమర్పణ రోజున ప్రీమార్కెట్ ట్రేడింగ్పై ఆసక్తి ఉన్నవారికి ఉదయం 9:00 గంటల నుంచి 9:08 గంటల వరకు మార్కెట్ పనిచేస్తుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 కారణంగా ఎక్స్ఛేంజీ ప్రత్యేక ట్రేడింగ్ రోజుగా ప్రకటించిన ఫిబ్రవరి 01, 2025 (శనివారం) బిఎస్ఇ కూడా తెరిచి ఉంటుంది. సాధారణ ట్రేడింగ్ (trading) సమయాలే ఆ రోజు కూడా ఉంటాయి.
జనవరి 31, శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగం తర్వాత లోక్ సభ, రాజ్యసభ ల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడ్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు లోక్ సభ తాత్కాలికంగా రెండు రోజులు (ఫిబ్రవరి 3-4) కేటాయించగా, రాజ్యసభ మూడు రోజులు కేటాయించింది. ఫిబ్రవరి 6న రాజ్యసభలో చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు. బడ్జెట్ (budget 2025) సమావేశాలు సజావుగా సాగేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జనవరి 30న పార్లమెంటులో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.