Union Budget 2025 : విద్యలో ‘ఏఐ’- కొత్తగా మెడికల్ సీట్లు.. బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే!
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్లో విద్య కోసం కృత్రిమ మేధస్సులో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రకటించారు. మెడికల్ సీట్లు, ఐఐటీ సీట్ల పెంపును సైతం ప్రకటించారు.
బడ్జెట్ 2025లో భాగంగా విద్యా రంగంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. విద్య కోసం కృత్రిమ మేధస్సులో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ని తీసుకొస్తున్నట్టు వివరించారు. 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గుర్తుచేశారు.

విద్యా రంగంపై బడ్జెట్ 2025లో కీలక్ అప్డేట్స్..
యువతలో కుతూహలం, ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు.
భారత్ నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ.
2014 తర్వాత ప్రారంభమైన ఐదు ఐఐటీలకు అదనపు మౌలిక సదుపాయాల విస్తరణ. “గత పదేళ్లలో 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 100 శాతం పెరిగింది. 2014 తర్వాత ప్రారంభమైన 5 ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించేందుకు వీలుగా అదనపు మౌలిక సదుపాయాలు అమలు చేస్తాము. ఐఐటి పట్నాలో హాస్టల్, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాము,” అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
'మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్'కు అవసరమైన నైపుణ్యాలతో మన యువతను సన్నద్ధం చేయడానికి ప్రపంచ నైపుణ్యం, భాగస్వామ్యం కోసం ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిలింగ్ ఏర్పాటు. పాఠ్యప్రణాళిక రూపకల్పన, శిక్షకుల శిక్షణ, స్కిల్ సర్టిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్, కాలానుగుణ సమీక్షలు.
మొత్తం రూ.500 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు.
వైద్య విద్యను విస్తరించడానికి, ప్రభుత్వం వైద్య కళాశాలలకు 10,000 కొత్త సీట్లను జోడించడం- వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త వైద్య సీట్లను యాడ్ చేయడమే లక్ష్యం.
పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ కింద ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)ల్లో సాంకేతిక పరిశోధనల కోసం 10,000 ఫెలోషిప్‌లు.
విద్యా సంస్థలు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రైవేట్ కలెక్టర్లతో దేశ మాన్యుస్క్రిప్ట్ వారసత్వాన్ని సర్వే చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి, సంరక్షించడానికి ‘జ్ఞాన భారతం మిషన్’ అమలు. “ఇందులో కోటికి పైగా రాతప్రతులు ఉంటాయి. జ్ఞాన భాగస్వామ్యం కోసం భారతీయ విజ్ఞాన వ్యవస్థల జాతీయ భాండాగారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది,” అని నిర్మల చెప్పారు.
సంబంధిత కథనం