Union Budget 2024 : నిర్మల 'బడ్జెట్'కు వేళాయే.. అంచనాలను అందుకుంటుందా?
Union Budget 2024 live updates : నిర్మలా సీతారామన్ ఇంకొద్ది సేపట్లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. భారీ అంచనాలు, ఆశల మధ్య వస్తున్న ఈ బడ్జెట్ ఏ మేరకు ఉంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యావత్ భారత దేశం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'బడ్జెట్ 2024'కి సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో మోదీ 3.0 తొలి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడ్జెట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకున్నాయి.
అంతకుముందు, మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయానికి వెళ్లారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ ట్యాబ్లెట్‌ను బయటకు తీసుకొచ్చి మీడియాకు చూపించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, బడ్జెట్ 2024 గురించి వివరించారు. అక్కడి నుంచి ఇంకొద్ది సేపట్లో పార్లమెంట్ భవనానికి చేరుకోనున్నారు.
బడ్జెట్ 2024పై కోటి ఆశలు..
మోడీ 3.0లో తొలి బడ్జెట్ కావడంతో.. నేటి నిర్మల 'పద్దు'పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని మధ్యతరగతి ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వివిధ రంగాల వ్యాపారవేత్తలు సైతం తమ ఇప్పటికే తమ అంచనాలను పంచుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం, ఎన్డీఏ కూటమి పార్టీల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ఎలా ఉండనుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:- Budget 2024 : ఈ మాటలన్నింటికీ అర్థం తెలిస్తే బడ్జెట్ ఈజీగా అర్థమవుతుంది
సొంత రికార్డును నిర్మల బ్రేక్ చేస్తారా?
సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగించిన చరిత్ర నిర్మలా సీతారామన్ సొంతం. 2020లో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టి 2:42 గంటలు మాట్లాడారు. 2019లో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసగించారు. మరి ఈ దఫా బడ్జెట్లో ఆమె ఎంతసేపు మాట్లాడతారు? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ఫోకస్..
బడ్జెట్ 2024 నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లు స్వల్ప లాభాలు- స్వల్ప నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం ఇందుకు కారణం.
కాగా ఈ దఫా బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా స్పెక్యులేటివ్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో రీటైలర్ల కార్యకలాపాలు పెరుగుతుండటంపై సెబీ, ఆర్బీఐ, నిర్మల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ బడ్జెట్లో ప్రతికూలంగా ఏవైనా నిర్ణయాలు ఉంటాయా? అన్నది కీలకంగా మారనుంది. దీనితో పాటు.. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌లో ఏవైనా మార్పులు ఉంటాయా? అన్న విషయాన్ని కూడా మదుపర్లు ఎదురుచూస్తున్నారు.
ఇవి కాకుండా డిఫెన్స్, మౌలికవసతులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లోను సంస్కరణలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని నిర్మల ఎలా డీల్ చేస్తారో చూడాలి.
ఈ ప్రశ్నలు, సందేహాలకు ఇంకొంత సేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది.