Stock market crash : స్టాక్ మార్కెట్‌పై ‘ట్యాక్స్ ’ మోత- భారీ నష్టాల్లో సూచీలు..
ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్సాన్సాక్షన్ ట్యాక్స్)ని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ వెంటనే దేశీయ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.
2024 బడ్జెట్లో భాగంగా ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్సాన్సాక్షన్ ట్యాక్స్)ని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫలితంగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మధ్యాహ్నం 12:45 నిమిషాల ప్రాంతంలో సెన్సెక్స్ 736 పాయింట్ల నష్టంతో 79,766 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 217 పాయింట్లు కోల్పోయి 24,293 వద్ద ట్రేడ్ అవుతోంది.
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి?
ఈక్విటీ షేర్లు, డెరివేటివ్‌లు (ఫ్యూటర్ అండ్ ఆప్షన్స్), మ్యూచువల్ ఫండ్స్‌కి చెందిన యూనిట్ల విక్రయాలపై వేసే ప్రత్యక్ష పన్నును సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు. ఈ ఎస్టీటీ ఎక్కువ ఉంటే, మదుపర్లు/ ట్రేడర్లకు నష్టం జరుగుతుంది. అందుకే బడ్జెట్ 2024లో నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేసినప్పుడు స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి.
మూలధన లాభాలపైనా..
అంతేకాదు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్. స్వల్పకాలిక మూలధన లాభాలపై 20శాతం పన్ను వేసినట్టు తెలిపారు. ఇక దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5శాతం పన్నును విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇప్పటివరకు 10శాతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై 15శాతం పన్నులు ఉండేవి.
ఇక అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, మార్కెట్ ఆధారిత డిబెంచర్లపై శ్లాబు రేటుతో సమానమైన ట్యాక్సులు పడతాని నిర్మల వెల్లడించారు.
అయితే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇప్పటివరకు ఉన్న రూ. 1లక్ష మినహాయింపును రూ. 1.25లక్షలకు ప్రభుత్వం పెంచింది.
ఆ విషయంలో మాత్రం ఊరట..!
ట్యాక్స్‌లు పెంచినా, ఎఫ్ అండ్ ఓపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రతకూల నిర్ణయాలు తీసుకోకపోవడం స్టాక్ మార్కెట్లకు కాస్త ఊరటనిచ్చే విషయం! స్పెక్యులేటివ్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో రీటైలర్ల ప్రాతినిథ్యంపై సెబీ, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్లో ఈ విషయంపై ప్రతికూల వ్యాఖ్యలు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావించాయి. కానీ అలాంటివేవీ నిర్మల ప్రకటించలేదు.
మండిపడుతున్న ప్రజలు..
ఎస్టీటీ, మూలధన లాభాలపై ట్యాక్స్ పెంచుతున్నట్టు బడ్జెట్ 2024లో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“జీరో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని కట్టడి చేసేందుకు తొలుత ఎస్టీటీ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రెండింటినీ పెంచేశారు. #worstFM” అని ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“డివిడెండ్‌పై ట్యాక్స్, ఎఫ్డీపై ట్యాక్స్, ఇల్లు కొంటే ట్యాక్స్, పెట్రోల్‌పై ట్యాక్స్, పాలు- పెరుగుపై ట్యాక్స్, స్టాక్స్‌పై ట్యాక్స్, పీఎఫ్‌పై ట్యాక్స్, సినిమా హాల్లో ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై ట్యాక్స్,” అంటూ ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం