డబ్బును ఖాళీగా ఉంచడం కంటే పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసి ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు డిపాజిట్ పథకాలను చూస్తారు. దేశంలోని వివిధ బ్యాంకులు అనేక రకాల డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టి మంచి రాబడులు పొందుతుంటారు. మీరు త్వరలో బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. అదే యూనియన్ వెల్నెస్ డిపాజిట్ స్కీమ్.
ప్రభుత్వ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం యూనియన్ వెల్నెస్ డిపాజిట్ స్కీమ్ అనే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని మెుదలుపెట్టింది. ఈ పథకం కింద బ్యాంకు ప్రజలకు మంచి రాబడితో పాటు ఆరోగ్య బీమా రక్షణను కూడా అందిస్తుంది.
18 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా యూనియన్ వెల్నెస్ డిపాజిట్ పథకంలో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారులు రూ.10 లక్షల నుండి రూ.3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. తర్వాత పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం 6.75 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు. దీని వ్యవధి 375 రోజులు. ఇది మాత్రమే కాదు.. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
యూనియన్ వెల్నెస్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కూడా పొందుతారు. యూనియన్ వెల్నెస్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు మెచ్యూరిటీకి ముందే తమ డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే, పెట్టుబడిదారులు రుణాలు కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ స్కీమ్ అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.