Unacademy : ‘ఈసారి జీతాల పెంపు లేదు’- రూ. 33,500 టీషర్ట్​ వేసుకుని ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన సీఈఓ!-unacademy ceo announces no salary hikes for employees while wearing 400 dollar tshirt ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Unacademy : ‘ఈసారి జీతాల పెంపు లేదు’- రూ. 33,500 టీషర్ట్​ వేసుకుని ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన సీఈఓ!

Unacademy : ‘ఈసారి జీతాల పెంపు లేదు’- రూ. 33,500 టీషర్ట్​ వేసుకుని ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన సీఈఓ!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2024 12:10 PM IST

అన్అకాడమీ ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాంటి అప్రైజల్ లభించబోదని సీఈఓ గౌరవ్ ముంజాల్ గత వారం చెప్పారు. 400 డాలర్లు (రూ. 33,500) విలువ చేసే టీషర్టు ధరించి ఆయన ఆ ప్రకటన చేశారు.

అన్​అకాడమీ సీఈఓ గౌరవ్ ముంజాల్
అన్​అకాడమీ సీఈఓ గౌరవ్ ముంజాల్

అన్అకాడమీ ఉద్యోగులకు సంస్థ సీఈఓ గౌరవ్ ముంజాల్ షాక్​ ఇచ్చారు. ఈ ఏడాది ఎలాంటి అప్రైజల్​ ఉండదని తేల్చిచెప్పారు. అయితే ఆయన 400 డాలర్లు (రూ. 33,500) విలువ చేసే షర్ట్​ వేసుకుని, ఈ ప్రకటన చేయడం సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. ‘మీరు విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తుంటారు. ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచరు,’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అన్​అకాడమీ ఉద్యోగులకు జీతాల పెంపు లేదు..

గతవారం 400 డాలర్ల బర్బెర్రీ టీషర్టు ధరించి, కంపెనీ వర్చువల్ టౌన్​హాల్​లో కనిపించిన ముంజాల్.. ఉద్యోగులకు జీతాల పెంపు లేదని ప్రకటించారు.

ఉద్యోగులను ఉద్దేశించి ఎడ్ టెక్ సంస్థ అన్అకాడమీ సీఈఓ మాట్లాడుతూ.. తాము తమ వృద్ధి లక్ష్యాలను చేరుకోలేదని, అందువల్ల ఉద్యోగులకు అప్రైజల్స్ ఇవ్వలేమని చెప్పారు. '2023 మాకు యావరేజ్​ ఏడాది. కానీ 2024 గొప్పగా కాకపోయినా సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ మా వృద్ధి లక్ష్యాలను చేరుకోలేకపోయాం. మంచి విషయం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. సంస్థకు మనుగడ ప్రమాదం లేదని నేను చెబుతూనే ఉన్నాను," అని అన్​అకాడమీ సీఈఓ గౌరవ్ ముంజాల్ టౌన్​హాల్​లో చెప్పారు.

ప్రతికూలతలు, క్లిష్టమైన మార్కెట్, ఆఫ్​లైన్​ సెంటర్ల నుంచి ఆదాయం తగ్గడం వంటివి అన్అకాడమీ తన లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు.

"ఇప్పుడు వరకు కష్టాలే కనిపించాయి. ఈసారి కూడా బ్యాడ్​ న్యూస్​ చెప్పాల్సి వస్తోంది. ఈ ఏడాది జీతాల పెంపు లేదని చెప్పడం కఠినంగా ఉంది," అని ముంజాల్ చెప్పారు. రెండు, మూడు వారాల క్రితమే అంచనాలు వేస్తామని చెప్పానని, అయితే ఈ ప్రక్రియను ప్రారంభించినప్పుడు తాము తప్పు చేసినట్టు అర్థమైందని చెప్పారు. కొంతమంది ఉద్యోగులకు రెండేళ్లుగా అప్రైజల్స్ రాలేదని అంగీకరించిన ఆయన, ‘బిగ్గర్​ పిక్చర్’​ని చూడాలని తన సిబ్బందిని కోరారు. తమ ప్రత్యర్థులు ఒక్కొక్కరుగా కిందకు దిగుతుంటే తాము మాత్రం బలంగా నిలబడి ఉన్నామని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో స్పందనలు..

అప్రైజల్​ లేదన్న విషయాన్ని పక్కనపెడితే.. ఉద్యోగులకు బాధ కలిగించే విషయాన్ని సంస్థ సీఈఓ ఖరీదైన 'టీషర్ట్​ వేసుకుని చెప్పడంపై సోషల్​ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

ఓ రెడిట్ యూజర్ ముంజాల్ ఖరీదైన టీషర్ట్​ను చూపిస్తూ అన్​అకాడమీ టౌన్​హాల్​కు చెందిన స్నిప్పెట్​ను షేర్ చేశాడు. అది వైరల్​గా మారింది.

ఎడ్ టెక్ సంస్థ సీఈఓ బ్లాక్ కలర్​ బర్బెర్రీ పార్కర్ టీషర్ట్ ధరించి కనిపించారు. ఆన్​లైన్​లో దీని రీసేల్ ధరలు 200 డాలర్ల నుంచి 570 డాలర్ల మధ్య ఉంటాయి. రెడ్డిట్ వినియోగదారులు ఎక్కువగా అతని దుస్తుల ఎంపికను విమర్శించారు.

"ఈ సీఈఓలు వారి సొంత జీవన ప్రమాణాలను తగ్గించుకోరు, కానీ వారి వ్యాపారాలను నడుపుతున్న ఉద్యోగుల జీతాలను ఆపివేస్తారు" అని ఒక వ్యక్తి రాశారు.

“ఉద్యోగులకు అప్రైజల్​ లేదని చెప్పిన ఈ వ్యక్తే, ప్రైవేట్​ జట్లలో ప్రయాణించేవాడు. సమయం చాలా విలువైనదని, అందుకే ప్రైవేట్​ జట్లలో ప్రయాణిస్తున్నట్టు తన చర్యలను సమర్థించుకునేవాడు,” అని మరొకరు అన్నారు.

అవాస్తవ వృద్ధి రేటు లక్ష్యాలను ఉంచుకోవాలని ఆయనకు ఎవరు చెప్పారు? వారు నష్టపోకపోతే ప్రతి ఉద్యోగికి జీతాలు పెంచాలి,' అని మూడో వ్యక్తి అభిప్రాయపడ్డారు.

కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి అన్అకాడమీ 250 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ నో అప్రైజల్ ఇయర్ వార్తలు రావడం గమనార్హం.

మరి ఇలా ఖరీదైన టీషర్ట్​ వేసుకుని ఇలాంటి ప్రకటనలు చేయడంపై మీ స్పందన ఏంటి?

సంబంధిత కథనం

టాపిక్