Ultraviolette F77 SuperStreet : మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కిలోమీటర్లు
Ultraviolette F77 SuperStreet : ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అల్ట్రావయొలెట్ తన పోర్ట్ ఫోలియోలో మరో కొత్త మోటర్ సైకిల్‌ను చేర్చింది. కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ ఎఫ్77ను రోజువారీ పనులకు అనుగుణంగా రూపొందించారు.
ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ సెగ్మెంట్‌లో టూ వీలర్స్ కూడా ఎక్కువే లాంచ్ అవుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ మోటార్ సైకిల్ లాంచ్ చేసింది. ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ లాంచ్ ధర స్టాండర్డ్ ఎఫ్77 మాక్ 2 మాదిరిగానే ఉంటుంది.

ధర
అల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ ప్రారంభ ధర రూ .2.99 లక్షలు. ఇది కొనుగోలుదారులకు రోజువారీ ప్రయాణాన్ని ఎఫ్ 77 మాక్ 2 కంటే మరింత సౌకర్యవంతంగా చేయడానికి సాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
రైడర్ కోసం మార్పులు
స్టాండర్డ్ బైక్‌లో అందించే హ్యాండిల్ బార్ కంటే చాలా పొడవుగా ఉండే కొత్త హ్యాండిల్ బార్‌ను కంపెనీ ఇందులో ఇచ్చింది. ఈ విధంగా రైడర్ పొజిషన్‌లో మార్పు జరిగింది. ఇది బైక్ రైడింగ్ చేసేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ ఇప్పుడు స్ట్రీట్ బైక్ వలె వెడల్పుగా ఉంది. ఇది ట్రాఫిక్‌లో రైడర్ వేగంగా కదలడానికి ఉపయోగపడుతుంది. అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ 5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోణాన్ని రైడర్ కోసం మార్చింది.
ఫీచర్లు
రైడింగ్ స్టైల్‌తోపాటుగా డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్‌లో కొత్త హెడ్ లైట్ కౌల్ ఉంది. ఏరోడైనమిక్ పనితీరులో 15 శాతం మెరుగుదల ఉందని కంపెనీ పేర్కొంది. 207 కిలోల బరువున్న సూపర్ స్ట్రీట్ బరువు కొత్త హ్యాండిల్ బార్‌లతో సుమారు అరకిలో పెరిగింది. ఈ డిజైన్ ఎలిమెంట్స్ కాకుండా అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 సూపర్ స్పోర్ట్ దాదాపు ఎఫ్77 మ్యాక్ 2ను పోలి ఉంటుంది.
రేంజ్ ఎంతంటే
ఎఫ్ 77 సూపర్ స్పోర్ట్ టాప్-స్పెక్ రెకాన్ వేరియంట్ 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది వెనుక చక్రాన్ని నడిపే సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 40.2 బీహెచ్‌పీ పవర్, 100 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ రేంజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
ఫోర్క్ కవర్లతో కూడిన యూఎస్డీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్, ఫ్యాన్సీ స్వింగర్మ్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేకులు, రెండు వైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 110-సెక్షన్ ఫ్రంట్, 150-సెక్షన్ రియర్ టైర్లతోపారు మరేన్నో ఫీచర్లు అల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్‌లో అందించారు.