Credit Suisse - UBS Deal: ‘బ్యాంకింగ్‍’లో భారీ డీల్: యూబీఎస్ చేతికి క్రెడిట్‍ సూస్‍: 167 ఏళ్ల చరిత్ర.. 99 శాతం పతనం-ubs takes over credit suisse thing to know about this deal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ubs Takes Over Credit Suisse Thing To Know About This Deal

Credit Suisse - UBS Deal: ‘బ్యాంకింగ్‍’లో భారీ డీల్: యూబీఎస్ చేతికి క్రెడిట్‍ సూస్‍: 167 ఏళ్ల చరిత్ర.. 99 శాతం పతనం

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2023 11:10 AM IST

Credit Suisse - UBS Deal: క్రెడిట్ సూస్ బ్యాంకును కొనుగోలు చేసేందుకు యూబీఎస్ బ్యాంకు డీల్ కుదుర్చుకుంది. ఈ రెండు స్విట్జర్లాండ్ బ్యాంకుల మధ్య చరిత్రాత్మక డీల్ జరిగింది.

Credit Suisse - UBS Deal: బ్యాంకింగ్‍లో భారీ డీల్: యూబీఎస్ చేతికి క్రెడిట్‍ సూస్
Credit Suisse - UBS Deal: బ్యాంకింగ్‍లో భారీ డీల్: యూబీఎస్ చేతికి క్రెడిట్‍ సూస్ (Reuters)

Credit Suisse - UBS Deal: స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూస్ (Credit Suisse) ఇక ఉండబోదు. సంక్షోభంలో కూరుకుపోతున్న ఆ బ్యాంకును అదే దేశానికి చెందిన అతిపెద్ద బ్యాంకు యూబీఎస్ (UBS) గ్రూప్ ఏజీ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. 3.25 బిలియన్ డాలర్లకు క్రెడిట్‍ సూస్‍ గ్రూప్ ఏజీ(Credit Suisse Group AG)ని దక్కించుకునేందుకు యూబీఎస్ గ్రూప్ అంగీకారం తెలిపింది. దీంతో 167 ఏళ్ల చరిత్ర ఉన్న క్రెడిట్ సూస్ ఇక యూబీఎస్‍లో కలిసిపోనుంది. ఈ డీల్‍లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఆందోళనలో ఉన్న తరుణంలో ఈ డీల్ ఉపశమనం కలిగిస్తుందని అంచనాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా ఈ డీల్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

99 శాతం పతనం

Credit Suisse - UBS Deal: 2007 తర్వాతి నుంచే క్రెడిట్ సూస్ బ్యాంక్ కష్టాలు మొదలయ్యాయి. 2008 సంక్షోభం తర్వాత నియంత్రణలు అమలు కావటంతో క్రమంగా ఆ బ్యాంకు పతనమవుతూ వచ్చింది. 2007లో గరిష్ఠ ధరతో పోల్చుకుంటే ఈక్విటీ మార్కెట్‍లో ఆ బ్యాంక్ షేర్ ధర 99 శాతం పడిపోయింది. కాగా, తాజా సంక్షోభంతో గత వారంలోనే ఆ బ్యాంక్ షేర్ ధర 24 శాతం క్షీణించింది.

అమెరికా నుంచి..

Credit Suisse - UBS Deal: ఇటీవల బ్యాంకింగ్ సంక్షోభం ముందుగా అమెరికాలో మొదలైంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) ఒక్కసారిగా కుప్పకూటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేగింది. ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ మూతపడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాలు వణికిపోయాయి. స్విట్జర్లాండ్‍లోని క్రెడిట్ సూస్ బ్యాంక్ కూడా సంక్షోభం బాటలోకి వచ్చింది. ఒక్కసారిగా ఆ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. దీంతో ఆ బ్యాంకు మూతపడుతుందన్న భయాలు వెల్లడయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మార్కెట్‍పై పడింది. అయితే స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ఆర్థిక నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. చాలా ఆప్షన్లను పరిశీలించాయి. చివరికి క్రెడిట్ సూస్, యూబీఎస్ మధ్య ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకున్నాయి.

చరిత్ర ఇదే..

Credit Suisse - UBS Deal: క్రెడిట్ సూస్ బ్యాంకు 1856లో స్విట్జర్లాండ్‍లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచంలోనే ఒకానొక ప్రధాన బ్యాంక్‍గా అవతరించింది. ప్రపంచ మార్కెట్లనే ప్రభావితం చేసే దశకు చేరింది. 1862లోనే యూబీఎస్ బ్యాంక్ కూడా స్థాపితమైంది. ఈ రెండు బ్యాంకులు క్రమంగా వృద్ధి చెందుతూ.. స్విట్జర్లాండ్‍లో టాప్-2 బ్యాంకులుగా దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అయితే 2007 తర్వాతి నుంచి క్రెడిట్ సూస్.. ప్రాభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఏకంగా పోటీదారు అయిన యూబీఎస్‍లోనే కలిసిపోనుంది.

క్రెడిట్ సూస్‍ను యూబీఎస్ చేజిక్కించుకోవటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

“ఇటీవల.. ఫైనాన్షియల్ మార్కెట్లు కోల్పోయిన విశ్వాసాన్ని ఈ డీల్ మళ్లీ తిరిగి తెస్తుంది. క్రెడిట్ సూస్ కుప్పకూలితే ఆ ప్రభావం దేశంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం భారీగా ప్రభావం ఉంటుంది” అని స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలాయిన్ బెర్సెట్ చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం