ఉబర్ భారతదేశంలో రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు కంపెనీ మరో ప్రత్యేకమైన సేవను మెుదలుపెట్టింది. ఈ కొత్త సర్వీస్‌పై పెంపుడు జంతువుల ప్రేమికులు చాలా సంతోషంగా ఉన్నారు. ఉబెర్ బెంగళూరులో ఉబర్ పెట్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పుడు పెంపుడు జంతువులతో సులభంగా ప్రయాణించవచ్చు.
ఈ కొత్త సేవతో పెంపుడు జంతువును ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఉబెర్ పెట్ మీ పెంపుడు జంతువుతో మీకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని, తద్వారా మీరు, మీ పెంపుడు జంతువు రైడ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది.
ఉబర్ పెట్ రైడర్‌లకు వారి పెంపుడు జంతువుతో(కుక్క లేదా పిల్లి) రైడ్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. దీని కోసం మీరు ఉబర్ యాప్‌లో ఉబర్ పెట్ ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి. రైడ్‌ను బుక్ చేయడానికి దశలవారీ కొన్ని ఆప్షన్స్ ఫాలో కావాలి. ఇందుకోసం ముందుగా ఉబెర్ యాప్‌ని ఓపెన్ చేసి, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి సంబంధించిన అడ్రస్‌ను Where అనే బాక్స్‌లో నమోదు చేయాలి. అప్పుడు స్క్రీన్ దిగువన అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీరు Uber Petని ఎంచుకోవాలి.
దీని తర్వాత మీరు పికప్ సమయాన్ని నమోదు చేయాలి. ఆపై బుకింగ్ వివరాలను మళ్లీ తనిఖీ చేసి, కన్ఫర్మ్ బటన్‌పై నొక్కండి. ఉబెర్ పెట్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా పెంపుడు జంతువు కూడా మీ వెంట ఉంటే డ్రైవర్లకు కూడా తెలుస్తుంది. ఉబెర్ పెట్ బెంగళూరులోని రైడర్‌ల కోసం ఉబెర్ యాప్‌లో రిజర్వ్-ఓన్లీ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది. బెంగళూరు రైడర్లు తమ రైడ్‌లను 60 నిమిషాల నుండి 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణంలో పెంపుడు జంతువులను వదిలి వెళ్లకూడదనుకునే వారి కోసమే ఉబర్ పెట్ ఫీచర్ అని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం రైడర్‌కు సౌకర్యాన్ని అందించడమే కాకుండా ప్రయాణ సమయంలో పెంపుడు జంతువు వెంట ఉంటే కొందరికి మనశ్శాంతి ఉంటుంది.
ఇది మాత్రమే కాదు కొత్త సర్వీస్ ఉబెర్ ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవర్లకు అదనపు ఆదాయ అవకాశాలను కూడా అందిస్తుంది. Uber Pet రైడర్‌లు, డ్రైవర్‌లు ఇద్దరికీ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. ట్రిప్‌లను కనెక్ట్ చేయడం, భాగస్వామ్యం చేయడం సులభం చేస్తుంది. ఈ ఉబర్ పెట్ సర్వీస్ హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి..