ప్రపంచ దేశాలపై టారీఫ్‌లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ని సైతం విడిచిపెట్టలేదు! ఓవైపు వాణిజ్య ఒప్పందానికి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతుండగా, మరోవైపు భారత్‌పై 25శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. అంతేకాదు, రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలను దెబ్బతీసే విధంగా, ఆ దేశం నుంచి ఎనర్జీ, మిలిటరీ పరమైన కొనుగోళ్లు చేస్తే పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ టారీఫ్‌ల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్ మదుపర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వ్యవస్థపై ట్రంప్ టారీఫ్‌ల ప్రభావం ఎంత? భారత స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్, ఆటో విడిభాగాలు, లెథర్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, కొన్ని రకాల ఆహార ఎగుమతులపై ఈ సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సుంకాల కారణంగా ఇతర రంగాలపైనా ప్రభావం పడి, మొత్తం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది! ఈ పరిస్థితిని అంచనా వేసిన ఆర్థిక నిపుణులు ఇప్పటికే భారతదేశ వృద్ధి అంచనాలను కట్ చేయడం మొదలుపెట్టారు. సుంకాల వల్ల ఎగుమతులు తగ్గడం, ప్రైవేట్ పెట్టుబడుల వ్యయంపై ప్రభావం పడటం వంటివి దీనికి ప్రధాన కారణాలు.
ఐక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ మాట్లాడుతూ.. "అమెరికా మొదట సుంకాలు విధించినప్పుడు, ఎగుమతులు మందగించవచ్చని, ప్రైవేట్ పెట్టుబడులు ఆలస్యం కావచ్చని అంచనా వేసి 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.2 శాతానికి తగ్గించాం. ఇప్పుడు అమెరికా ప్రతిపాదించిన సుంకాలు మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఇది భారతదేశ జీడీపీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావం జరిమానాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది," అని అన్నారు.
సుంకాల ప్రకటన తర్వాత భారత స్టాక్ మార్కెట్ రేంజ్లో కొనసాగే అవకాశం ఉందని, తదుపరి చర్చలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఫ్యూచర్స్ సుమారు 200 పాయింట్లు పడిపోయాయి.
వాస్తవానికి, గత రెండు నెలలుగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడంతో దేశీయ మార్కెట్ పరిమిత స్థాయిలో కదలాడుతోంది. ట్రంప్ తాజాగా విధించిన 25 శాతం సుంకాలు ప్రతికూల పరిణామంగా మారడంతో మార్కెట్ సెంటిమెంట్ నిరాశాజనకంగా ఉండవచ్చు.
చాయిస్ బ్రోకింగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ ఉత్సవ్ వర్మ మాట్లాడుతూ.. "స్వల్పకాలంలో మార్కెట్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు. పెద్ద ఎత్తున తక్షణ ప్రతిస్పందనను మేము ఆశించడం లేదు. అయితే కొనసాగుతున్న త్రైమాసిక ఫలితాలపై దృష్టి సారించి మార్కెట్ పరిమిత స్థాయిలో కదలాడుతుంది," అని అన్నారు. వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమోటివ్ విడిభాగాలు వంటి కీలక ఎగుమతి ఆధారిత రంగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చని, స్వల్పకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చని ఆయన చెప్పారు.
కొందరు నిపుణులు మాత్రం ఈ కొత్త సుంకాలు.. మార్కెట్ అంచనా వేసిన దానికంటే పెద్దగా భిన్నంగా లేవని పేర్కొన్నారు.
ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ మాట్లాడుతూ.. "భారతీయ వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామన్న ట్రంప్ ప్రకటన, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, మార్కెట్లు సిద్ధంగా ఉన్న 15-20 శాతం పరిధిలోనే ఉంది. ఆ కోణంలో చూస్తే, ఇది పూర్తిగా ఊహించనిది కాదు," అని అభిప్రాయపడ్డారు.
"ఇది స్వల్పకాలిక ఎగుమతి పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. సెంటిమెంట్ క్షీణిస్తే కరెన్సీ అస్థిరతకు దారితీయవచ్చు. అయినప్పటికీ, భారతదేశం, అమెరికా మధ్య మొత్తం వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలకు ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది, ఇంకా ఆందోళన కలిగించే స్థితికి చేరుకోలేదు," అని అజీజ్ అన్నారు.
భారత మార్కెట్ ప్రస్తుతం దేశీయ పెట్టుబడిదారులచే ఎక్కువగా నడపబడుతుందని, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దాదాపు 85 శాతం షార్ట్‌లో ఉన్నారని అజీజ్ గుర్తు చేశారు. కాబట్టి, పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.
"స్టాక్ మార్కెట్లో కొంత అస్థిరత ఉండవచ్చు; రెండు మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన పెట్టుబడిదారులకు.. స్టాక్ మార్కెట్లు పడితే, కొనుగోలు చేసే అవకాశం లభించినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటికే 10 నెలల టైమ్ కరెక్షన్‌ను చూశాం," అని అజీజ్ చెప్పారు.
ట్రంప్ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి, ఈ సమయంలో ట్రంప్ ఈ గడువును పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయి. సుంకాలు 15 శాతం పరిధికి తగ్గుతాయనే అంచనాలు ఇంకా ఉన్నాయి.
సంబంధిత కథనం