భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌కు సెప్టెంబర్ 2025లో అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 ఒక తీపి కబురు అందించింది. సవరించిన ఈ వస్తు, సేవల పన్ను విధానం వాహనాలపై పన్నుల విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా, పన్ను శ్లాబ్‌లను సరళతరం చేయడం, గతంలో కార్ల ధరలను పెంచిన కొన్ని అదనపు సెస్సులను తొలగించడం వంటివి చేశారు.
ఈ కొత్త పన్ను విధానం ప్రకారం.. చిన్న కార్లపై జీఎస్టీ 18%కి తగ్గింది. ముఖ్యంగా, 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లు, అలాగే పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం 1,200 సీసీ లోపు, డీజిల్ ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ లోపు ఉన్న కార్లు మాత్రమే ఈ తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. గతంలో, ఈ మోడళ్లకు కాంపెన్సేషన్ సెస్ కలుపుకొని దాదాపు 29% నుంచి 31% వరకు పన్ను ఉండేది! ఈ భారీ తగ్గింపు కారణంగా, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు భారీగా తగ్గాయి. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత ధర తగ్గిన ఐదు హ్యాచ్‌బ్యాక్ కార్ల వివరాలు ఇక్కడ చూడండి..
టాప్ 5 హ్యాచ్బ్యాక్స్..
| మోడల్ | ప్రారంభ ఎక్స్‌షోరూం ధర | ఎంత ధర తగ్గింది? |
|---|---|---|
| మారుతీ సుజుకీ ఆల్టో కే10 | రూ. 3.70 లక్షలు | రూ. 1.08 లక్షలు |
| మారుతీ సుజుకీ వాగన్ఆర్ | రూ. 4.99 లక్షలు | రూ. 80వేలు |
| టాటా టియాగో | రూ. 4.57 లక్షలు | రూ. 75వేలు |
| హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 | రూ. 5.47 లక్షలు | రూ. 74వేలు |
| హ్యుందాయ్ ఐ20ొ | రూ. 6.87 లక్షలు | రూ. 97వేలు |
1. మారుతీ సుజుకీ ఆల్టో కే10..
ధర: రూ. 3.70 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతీ సుజుకీ ఆల్టో కే10 ధర జీఎస్టీ 2.0 తర్వాత భారీగా తగ్గింది! ఈ కారు కాంపాక్ట్ సైజు, అలాగే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొత్త ప్రభుత్వ 'చిన్న కారు' నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది. వేరియంట్‌ను బట్టి, ఆల్టో కే10 ధర ఏకంగా రూ. 1.08 లక్షల వరకు తగ్గింది. దీనితో తొలిసారిగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.
2. మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్..
ధర: రూ. 4.99 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
ఎత్తైన డిజైన్‌తో కూడిన వ్యాగన్ఆర్ కారు కూడా సవరించిన జీఎస్టీ రేటు ప్రయోజనం పొందింది. దీని 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లు 18% పన్ను శ్లాబ్‌కు అర్హత పొందాయి. జీఎస్టీ 2.0 తర్వాత, వ్యాగన్ ఆర్ ధరలు కొన్ని వేరియంట్లలో రూ. 80,000 వరకు తగ్గాయి. దీంతో ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ, కుటుంబానికి అనుకూలమైన కారుగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
3. టాటా టియాగో..
ధర: రూ. 4.57 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
టాటా మోటార్స్ సంస్థకు చెందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ టియాగో ధర కూడా సుమారు రూ. 75,000 వరకు తగ్గింది. దృఢమైన బాడీ నిర్మాణం, మెరుగైన భద్రతా ఫీచర్లతో పేరుగాంచిన టియాగో, ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మరింత బలమైన పోటీదారుగా మారింది. ధరల తగ్గింపు ఈ పండుగ సీజన్‌లో టాటా అమ్మకాలను పెంచే అవకాశం ఉంది.
4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..
ధర: రూ. 5.47 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
తమ విభాగంలో అత్యధిక ఫీచర్లు ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 74,000 వరకు తగ్గాయి. ఈ ధర తగ్గింపు పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లన్నింటికీ వర్తిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో సౌకర్యం, స్టైల్ కోరుకునే నగర ప్రయాణికులకు ఇది గొప్ప ఎంపికగా నిలిచింది!
5. హ్యుందాయ్ ఐ20 ..
ధర: రూ. 6.87 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కొంచెం ప్రీమియం స్థానంలో ఉన్నప్పటికీ, చిన్న కారు ప్రమాణాలకు సరిపోయే హ్యుందాయ్ ఐ20లోని ఎంపిక చేసిన వేరియంట్లు కూడా చౌకగా మారాయి! జీఎస్టీ 2.0 కారణంగా, కొన్ని ట్రిమ్‌ల ధరలు ఏకంగా రూ. 97,000 వరకు తగ్గాయి. మార్కెట్లో కొనుగోలు చేయదగిన అత్యుత్తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఇదొకటి. ఈ ధర తగ్గింపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు నిజంగా పండుగే అని చెప్పవచ్చు.
సంబంధిత కథనం