50 వేల మందికి డబ్బులు ఇచ్చి 10 రోజులు సెలవులు ప్రకటించిన కంపెనీ.. కారణం ఇదే
Surat Diamonds : సూరత్‌కు చెందిన ఓ వజ్రాల సంస్థ 50,000 మంది కార్మికులకు 10 రోజుల సెలవులు ఇచ్చింది. అయితే దీని వెనక గల కారణాలను కూడా చెప్పింది.
గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన 50,000 మంది ఉద్యోగులకు ఆగస్టు 17 నుండి 27 వరకు 10 రోజుల సెలవును ప్రకటించింది. అంతేకాదు వారికి ఈ రోజులకు జీతం కూడా ఇస్తుంది. వజ్రాల వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి ఉత్పత్తిని నియంత్రించే సాధనంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
వజ్రాల పరిశ్రమ కఠినమైన ఇబ్బందుల్లో ఉందని, ప్రపంచ మార్కెట్‌లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కిరణ్ జెమ్స్ కంపెనీ తెలిపింది. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా మేం 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.
గుజరాత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీలు దీపావళి సందర్భంగా సుదీర్ఘ సెలవులు తీసుకుంటాయి. అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఉత్పత్తిని తగ్గించే విధంగా కంపెనీ ప్లాన్ చేసింది. ఇది ఉత్పత్తిని తగ్గించడంతోపాటుగా సరఫరాను నియంత్రిస్తుంది. ఈ నిర్ణయం కొన్ని రోజుల తర్వాత వజ్రాల పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చేలా ధరలను పెంచుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.
అంతేకాదు ఈ కంపెనీ కార్మికులకు వారి సెలవు రోజులకు డబ్బు రూపంలో పరిహారం ఇవ్వాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర వజ్రాల కంపెనీలు సమిష్టిగా ఉత్పత్తి నియంత్రణ చర్యలను చేస్తే.. డైమండ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని కిరణ్ జెమ్స్ కంపెనీ అభిప్రాయపడుతుంది.
'నా సంస్థలో 50,000 మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తున్నారు. అందులో 40,000 మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారు. 10,000 మంది ల్యాబ్‌లో డైమండ్ యూనిట్‌లో పని చేస్తున్నారు.' అని కిరణ్ జెమ్స్ ఛైర్మన్ లఖానీ చెప్పారు.
డిసెంబరు 2023లో ముంబై నుండి సూరత్ డైమండ్ బోర్స్ (SDB)కి తన ప్రాంగణాన్ని మార్చిన మొదటి వ్యక్తి ఆయన. ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారు కంపెనీల్లో కిరణ్ జెమ్స్ ఒకటి. పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారులలో ముందువరుసలో ఉంటుంది.
రూ. 17,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో, ప్రముఖ గ్లోబల్ డైమండ్ కంపెనీలలో ఒకటైన డి బీర్స్ రఫ్ డైమండ్ కొనుగోలుదారుల్లో కిరణ్ జెమ్స్ ఒకటి. వజ్రాలకు డిమాండ్ పడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వజ్రాల ఉత్పత్తి 15 శాతం పడిపోయిందని కంపెనీ చెప్పింది.
టాపిక్