Hero Splendor : మైలేజ్ కింగ్ హీరో స్ప్లెండర్ గురించి చాలా మందికి తెలియని విషయాలు
Hero Splendor : భారతీయ మార్కెట్‌లో హీరో బైకులకు మంచి డిమాండ్ ఉంది. మైలేజీ కింగ్‌గా చెప్పుకొనే స్ప్లెండర్ ప్లస్ ఈ కంపెనీదే. అయితే ఈ బైకు గురించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు.
భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో హీరో స్ప్లెండర్‌ను ఢీ కొట్టాలంటే చాలా కష్టం. ఈ బైకుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్లకు ఈ బైక్ అంటే పిచ్చి. కారణం దీని మైలేజీ, ధర. ఎక్కువ మంది ఈ బైకును ఇష్టపడుతారు. బడ్జెట్ ధరలో దొరకడంతో దీని అమ్మకాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ బైకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ డిమాండ్ మాత్రం బాగానే ఉంటూ వస్తుంది. మైలేజీలో తోపుగా ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..
మెుదట్లో హీరో మోటోకార్ప్ అనేది జపనీస్ ఆటోమేకర్ హోండాతో కలిసి ఉండేది. ఆ సమయంలోనే అంటే.. 1994లో స్ప్లెండర్ ప్రారంభించారు. తొందరలోనే ఈ బైక్ మార్కెట్‌లో రారాజుగా నిలిచింది. ఎందుకంటే బడ్జెట్ ధర తక్కువ నిర్వహణ, మైలేజీ కారణంగా ఉన్నాయి. అప్పటివరకూ వచ్చిన బైకులను వెనక్కు నెట్టేసింది.
అప్పుడు ఈ బైక్ 97.2 సిసి ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 7.44 బీహెచ్‌పీ పవర్, 7.95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చేదని చెబుతారు. మెుదలైన 10 సంవత్సరాల తర్వాత స్ప్లెండర్‌ను అప్‌డేట్ చేశారు. తర్వాత మార్కెట్‌లోకి స్ప్లెండర్ ప్లస్ వచ్చింది. మళ్లీ 2005లో స్ప్లెండర్ పెరిగిన శక్తితో మెుదలైంది.
ఆ తర్వాత కొత్త బైక్‌ను 125సీసీ అడ్వాన్స్‌డ్ స్విర్ల్ ఫ్లో ఇండక్షన్ సిస్టమ్ (ఏఎస్‌ఎఫ్‌ఎస్) ఇంజన్‌తో లాంచ్ చేశారు. ఇది హీరో, హోండా సహకారం నుండి వచ్చిన చివరి స్ప్లెండర్. ఈ పెంద వెంచర్ 2010లో నిలిపివేశారు. అయితే ఒప్పందం ప్రకారం హోండా సాంకేతికంగా 2014 వరకు హీరోకి మద్దతు ఇచ్చింది. ఈ సమయంలో స్ప్లెండర్ ప్రో కూడా మెుదలైంది.
2014 తర్వాత హీరో స్ప్లెండర్ బైక్‌ను సొంతంగా అభివృద్ధి చేయడం మెుదలుపెట్టింది. ప్రస్తుతం హీరో స్ప్లెండర్‌ను అనేక వేరియంట్‌లలో విక్రయిస్తోంది. స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం స్టాండర్డ్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధర రూ.75,441 నుండి రూ.78,286 ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది.
పరీక్షల్లో స్ప్లెండర్ ప్లస్ నగరంలో 80 కి.మీ, హైవేలో 92 కి.మీ వరకూ మైలేజీని ప్రకటించింది. 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో పూర్తి ట్యాంక్‌పై సుమారు 800 కి.మీ వెళ్లవచ్చు. ఈ కారణంగా హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మరే ఇతర వాహనం ఢీ కొట్టలేకపోయింది. ధర, విశ్వసనీయత, పనితీరు, మైలేజీతో మార్కెట్‌లో టాప్‌గా నిలిచింది.
110సీసీ కమ్యూటర్ బైక్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే స్ప్లెండర్ ప్లస్ బెస్ట్ ఆప్షన్. ఇన్నేళ్లయినా మార్కెట్‌లో స్ప్లెండర్ నిలదొక్కుకోవడం గొప్ప విషయం. దీనికి పోటీగా అనేక బైకులు వచ్చాయి. కానీ మధ్యతరగతివారికి ఈ బైకు పైనే గురి ఎక్కువ.
టాపిక్