Banned Chinese apps: పబ్జీ సహా ప్రభుత్వం నిషేధించిన చైనా యాప్ లు మళ్లీ ప్లే స్టోర్ లలో ప్రత్యక్షం
Chinese apps: భారత ప్రభుత్వం నిషేధించిన దాదాపు 36 చైనా యాప్ లు కొత్త పేర్లు, కొత్త యాజమాన్యాలు, కొత్త వర్షన్లతో మళ్లీ భారత్ లో ప్రత్యక్షమయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో అవి అందుబాటులో ఉన్నాయి. వాటిలో షీన్, క్సెండర్, పబ్జీ సహా గతంలో ప్రభుత్వం నిషేధించిన పలు చైనీస్ యాప్ లు ఉన్నాయి.

Banned Chinese apps: భారత్ లో గతంలో నిషేధానికి గురైన పలు చైనా యాప్ లు మళ్లీ ప్లే స్టోర్ లలో ప్రత్యక్షమయ్యాయి. గేమింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఫైల్ షేరింగ్ సహా పలు విభాగాల్లో ఇవి ఉన్నాయి. వీటిలో కనీసం 36 యాప్స్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని యాప్ లు బ్రాండింగ్ లో స్వల్ప మార్పులతో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. మరికొందరు డెవలపర్లు లేదా లైసెన్సింగ్ భాగస్వాములను మార్చారు.
కొత్త పేర్లు, ఓనర్లతో చైనీస్ యాప్స్
2020లో ఇండియా భద్రతా కారణాల దృష్ట్యా 267 చైనీస్ యాప్స్ ను నిషేధించింది. ఇందులో టిక్ టాక్, షేర్ ఇట్, వీచాట్, షీన్ వంటి పాపులర్ యాప్ లు ఉన్నాయి. 2022లో పబ్జీ, గరెనా ఫ్రీ ఫైర్ వంటి యాప్ లపై కూడా నిషేధం విధించారు. భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ యాప్స్ కొన్ని భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చాయి.
మ్యాంగో టీవీ కూడా..
ఫైల్-షేరింగ్ యాప్ అయిన క్సెండర్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్లో "క్సెండర్: ఫైల్ షేర్, షేర్ మ్యూజిక్" గా అందుబాటులో ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ మ్యాంగో టీవీ, యూకు, షాపింగ్ యాప్ టావోబావో, డేటింగ్ యాప్ టాంటన్ వంటి యాప్ లు తిరిగి వచ్చాయి. మ్యాంగోటివి దాని అసలు పేరును నిలుపుకోగా, టావోబావో ఇప్పుడు మొబైల్ టావోబావోగా లిస్ట్ అయింది. టాంటన్ యాప్ ఇప్పుడు టాంటాన్ - ఆసియా డేటింగ్ యాప్ గా రీబ్రాండింగ్ చేయబడింది.
రిలయన్స్ తో కలిసి షీన్ డిఫరెంట్ రూట్ లో..
కొన్ని యాప్ లు భారతదేశంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకున్నాయి. గతంలో 2020లో నిషేధానికి గురైన షీన్ యాప్ రిలయన్స్ రిటైల్ తో లైసెన్సింగ్ డీల్ ద్వారా తిరిగి భారత్ లోకి వచ్చింది. నివేదికల ప్రకారం, భారతదేశంలో విక్రయించే అన్ని షీన్ ఉత్పత్తులు ఆర్థిక విధానాలకు అనుగుణంగా స్థానికంగా తయారు చేయబడతాయి. 'షీన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్' పేరుతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఈ యాప్ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో విస్తరిస్తోంది. రిలయన్స్ తన అజియో ప్లాట్ఫామ్ లో షీన్ ఆఫర్లను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తోంది.
ఈ డేటింగ్ యాప్ కూడా
టిండర్ ను పోలిన డేటింగ్ యాప్ టాంటన్ ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటికీ తిరిగి వచ్చింది. దీని ఐఓఎస్ వెర్షన్ ఇప్పుడు టాంటన్ కల్చరల్ డెవలప్మెంట్ (బీజింగ్) కింద లిస్ట్ అయింది. ఆండ్రాయిడ్ వెర్షన్ టాంటన్ హాంగ్ కాంగ్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతుంది.
పబ్జీ, ఇతర గేమింగ్ యాప్స్ కూడా..
2020లో పాపులర్ గేమింగ్ యాప్ పబ్జీ భారత్ లో నిషేధానికి గురైంది. దానిని యాప్ స్టోర్ల నుంచి తొలగించారు. ఆ తరువాత బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGIM) పేరుతో 2021లో తిరిగి వచ్చిన ఈ సంస్థ 2022లో మరోసారి నిషేధాన్ని ఎదుర్కొంది. అధికారులతో చర్చించిన తర్వాత 2023లో బీజీఎంఐని పునరుద్ధరించారు. ఈ రీబ్రాండెడ్, రీప్యాకేజ్డ్ యాప్ లు చైనా ప్లాట్ ఫామ్ లు భారతదేశంలోకి తిరిగి ప్రవేశించే విధానంలో మార్పును సూచిస్తున్నాయి. కొన్ని వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఎంచుకుంటున్నాయి. మరికొందరు నిబంధనలకు అనుగుణంగా రీబ్రాండింగ్ తో వస్తున్నారు.