New credit card rules : రేపటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ అమలు- ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్! సెప్టెంబర్ 1 నుంచి పలు క్రెడిట్ కార్డు రూల్స్ మారనున్నాయి. వీటితో పాటు ఇతర ఆర్థిక పరమైన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి..
సెప్టెంబర్ సమీపిస్తున్న కొద్దీ పలు కీలక ఫైనాన్షియల్ మార్పులు అమల్లోకి రానుండటంతో వినియోగదారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 1, ఆదివారం నుంచి వివిధ బ్యాంకులు గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ని ప్రవేశపెట్టనున్నాయి. అవి.. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేస్తాయి. వినియోగదారులు ఈ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, గడువు దాటడానికి ముందు అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఆధార్, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు, క్రెడిట్ కార్డు నిబంధనలలో మార్పులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి..
సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్స్‌లో మార్పులు..
రూపే క్రెడిట్ కార్డులు..
సెప్టెంబర్ 1 నుంచి రూపే క్రెడిట్ కార్డుదారులు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనం పొందుతారు. రూపే క్రెడిట్ కార్డులు ఇకపై యూపీఐ లావాదేవీలకు ఇతర పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డు పాయింట్లను పొందుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆదేశించింది. రివార్డులు పొందడంలో రూపే కార్డుదారులు గతంలో ఎదుర్కొన్న ప్రతికూలతను ఈ మార్పు పరిష్కరిస్తుందని ఎన్పీసీఐ హైలైట్ చేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్..
రివార్డ్ పాయింట్లపై కొత్త క్యాప్‌లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్ 1 నుంచి ప్రవేశపెట్టనుంది. యుటిలిటీ, టెలికాం లావాదేవీల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లను బ్యాంక్ నెలకు 2,000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే స్కూల్ పేమెంట్లకు ఇకపై రివార్డ్ పాయింట్లు ఇవ్వరు. అయితే, విద్యా సంస్థలకు వారి వెబ్సైట్లు లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాల ద్వారా నేరుగా చెల్లింపులు కొనసాగుతాయి. స్విగ్గీ, టాటా న్యూ వంటి కో-బ్రాండెడ్, ప్రీమియం కార్డులతో సహా అన్ని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు ఈ పాలసీ వర్తిస్తుంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలు..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 స్టేట్మెంట్ సైకిల్ నుంచి ప్రారంభమయ్యే క్రెడిట్ కార్డ్ చెల్లింపు నిబంధనలలో మార్పులను అమలు చేస్తుంది. చెల్లింపు గడువు తేదీని స్టేట్మెంట్ జనరేషన్ తేదీ నుంచి 18 నుంచి 15 రోజులకు కుదించి, కార్డుదారులకు వారి బిల్లులను చెల్లించడానికి మూడు రోజులు తక్కువ సమయం ఇస్తారు. అదనంగా, చెల్లించాల్సిన కనీస మొత్తం (ఎంఏడీ) అసలు మొత్తంలో 5% నుంచి 2% కు తగ్గించింది. ఈ తగ్గింపు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, కాలక్రమేణా అధిక వడ్డీ ఛార్జీలను నివారించడానికి వినియోగదారులు కనీసానికి మించి చెల్లించాలని సలహా ఇస్తున్నారు.
ఈ క్రెడిట్ కార్డు మార్పులతో పాటు, ఇతర ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఆఫర్‌ని జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు మూడు నెలలు పొడిగించింది. అంతేకాకుండా, జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిజిస్ట్రేషన్ చేసిన 30 రోజుల్లోగా చెల్లుబాటు అయ్యే బ్యాంకు వివరాలను అందించాల్సి ఉంటుంది. వీటి ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం