సంస్థ నుంచి మోస్ట్ అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ కారును టెస్లా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది టెస్లా 'మోడల్ వై'కి చిన్న, చీపర్ వర్షెన్ అని సమాచారం. దీని వల్ల సంస్థకు 20శాతం తక్కువ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇండియాలో టెస్లా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే..
పలు మీడియా నివేదిక ప్రకారం, ఈ కొత్త టెస్లా మోడల్ పూర్తిగా కొత్త కారు కాదు. కానీ ప్రస్తుత మోడల్ వైకి రీవర్క్డ్ వర్షెన్! తన బలమైన ఎక్స్పెన్సివ్ పోర్ట్‌ఫోలియోతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్లను కూడా లాంచ్ చేసేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లాకి ఈ ఎలక్ట్రిక్ కారు ఉపయోగపడనుంది.
సరసమైన ఎలక్ట్రిక్ కారుతో టెస్లా తన భారత కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంతకు ముందు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు రూ .21 లక్షల ఈవీని ప్రవేశపెట్టవచ్చు. పలు నివేదికల ప్రకారం, టెస్లా తన బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను మొదట భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చు.
ఈ41 అనే కోడ్ నేమ్ కలిగిన కొత్త మోడల్ వై వేరియంట్ 2025లో చైనాలో ఉత్పత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. షాంఘై కర్మాగారం ప్రధానంగా చైనా మార్కెట్లో డిమాండ్‌ని తీర్చనుండగా, టెస్లా యునైటెడ్ స్టేట్స్లో కూడా ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రొడక్షన్లోని అన్ని సెగ్మెంట్స్లోనూ సేవింగ్స్ కనిపిస్తే, కొత్త మోడల్ వై బేస్ ప్రైజ్ 25వేల డాలర్లు- 30వేల డాలర్ల (ట్యాక్స్‌కి ముందు) మధ్యలో ఉండొచ్చు. అంటే సుమారు రూ. 21.7లక్షలు - రూ. 26.05లక్షలు.
గత ఏడాది మెక్సికోలో ప్రవేశపెట్టిన తక్కువ ధర మోడల్ 3 మాదిరిగానే ఈ మోడల్ కూడా అదే వ్యూహాన్ని అవలంబించనుంది. అదే మోటారు, బ్యాటరీని ఉంచుతూ హీటెడ్ సీట్లు, రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి కొన్ని ఫీచర్లను తగ్గించడం ద్వారా ఆ మోడల్ ఖర్చులు దిగొస్తాయి.
ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే అప్డేట్ చేసిన మోడల్ వై ఎంత చిన్నగా ఉంటుందనే దానిపై ఇంకా కొంత సందేహం ఉంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కారు సైజు తగ్గుతుంది, కానీ టెస్లా స్వయంగా గణనీయమైన నిర్మాణ లేదా బాడీలో మార్పులను వెల్లడించలేదు. ప్రస్తుత, భవిష్యత్తు ప్లాట్‌ఫామ్స్ నుంచి ఫీచర్లను మిళితం చేస్తూ, ప్రస్తుత ఉత్పత్తి మార్గాలను ఉపయోగించి ఈ మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్‌ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
మరి ఈ మోడల్ ఇండియా కోసమేనా? ఇండియాలో లాంచ్ అవుతుందా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం