ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ప్రపంచంలోని అనేక దేశాలలో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గాయి. యూరప్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆటోబ్లాగ్ నివేదిక ప్రకారం.. ఈ పతనం కారణంగా ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది.
అమెరికా ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా చాలా మంది సెలబ్రిటీలు తమ టెస్లా కార్లను వదిలివేస్తున్న సమయంలో టెస్లా నుండి ఈ ఆఫర్లు వస్తున్నాయి. కొంతమంది టెస్లా యజమానులు తమ వాహనాలపై రకరకాల స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఒక స్టిక్కర్ మీద 'ఎలోన్ పిచ్చితనం గురించి మాకు తెలియనప్పుడు నేను ఈ కారు కొన్నాను.' అని రాసి ఉంది. కొంతమంది టెస్లా షోరూమ్‌ల దగ్గర నిరసన వ్యక్తం చేసే దాకా వెళ్లారు.
టెస్లా తన కార్లను అమ్మడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది. ఇందులో సున్నా శాతం వడ్డీకి రుణాలు, జీవితాంతం ఉచిత ఛార్జింగ్ ఉన్నాయి. అదే సమయంలో కొన్ని కార్ల రుణాలపై చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. టెస్లా ఇటీవల సైబర్‌ట్రక్ అనే కారును విడుదల చేసింది. దానిని అమ్మడానికి కంపెనీ చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఈ కారు కోసం కంపెనీ 1.99 శాతం వడ్డీ రేటుకు రుణం ఇస్తోంది. ఈ రుణాన్ని టెస్లా ద్వారా మాత్రమే పొందవచ్చు.
వాహనం మొత్తం జీవితకాలం లేదా యజమాని వాహనాన్ని ఉపయోగించినంత కాలం టెస్లా సూపర్‌చార్జర్‌లకు కంపెనీ ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60,000 కంటే ఎక్కువ సూపర్‌ఛార్జర్‌లు ఉన్నాయి, ఇవి టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను రీఛార్జ్ చేయగలవు.
టెస్లా సూపర్‌చార్జర్‌లకు జీవితాంతం ఉచిత యాక్సెస్ పొందడం వల్ల టెస్లా వాహనాల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సాంప్రదాయ పెట్రోల్-డీజిల్ వాహనాల కంటే తమ వాహనాల నిర్వహణ ఖర్చు ఇప్పటికే తక్కువగా ఉందని టెస్లా పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు డిమాండ్ వేగంగా తగ్గుతోంది. ఫిబ్రవరిలో జర్మనీలో టెస్లా అమ్మకాలు 76శాతం తగ్గాయి. నెదర్లాండ్స్ 24శాతం తగ్గుదల నమోదు చేయగా, స్వీడన్ 42శాతం తగ్గుదల నమోదు చేసింది. ఫ్రాన్స్ 45శాతం, ఇటలీ 55శాతం, స్పెయిన్ 10శాతం, పోర్చుగల్ 53శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో టెస్లా రిజిస్ట్రేషన్లు 66శాతం తగ్గాయి.
టెస్లా ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించడానికి రెడీ అవుతోంది. కంపెనీ ముంబైలో ఒక షోరూమ్‌ను ప్రారంభించనుంది, అక్కడ టెస్లా కార్లను విక్రయిస్తారు. దీని కోసం కంపెనీ స్థలాన్ని కూడా చూసింది. టెస్లా భారతదేశంలో కూడా రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. అయితే సుంకానికి సంబంధించి అమెరికా, భారతదేశం మధ్య ఇంకా ఎటువంటి ఒప్పందం కుదరలేదు.
సంబంధిత కథనం