‘ఆటోమెటిక్’ ప్రపంచంలో సరికొత్త విప్లవం! టెస్లాకు చెందిన ఒక కారు.. ఫ్యాక్టరీ నుంచి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఓనర్ ఇంటికి వెళ్లి డెలివరీ పూర్తి చేసింది. ఇలా జరగడం ప్రపంచంలోనే ఇది మొట్టమొదిసారి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా మోడల్ వై కారు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా గిగాఫ్యాక్టరీ నుంచి సుమారు 30 నిమిషాల దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి ఎలాంటి మానవ జోక్యం లేకుండా వెళ్లింది. ఈ కారు హైవేలు, కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నగర వీధుల్లో పూర్తిగా ఆటోమెటిక్‌గా ప్రయాణించింది. టెస్లా సంస్థ ఈ డెలివరీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో టెస్లా మోడల్ వై కారు డ్రైవర్ సీటులో ఎవరూ లేకుండానే గిగాఫ్యాక్టరీ గ్యారేజ్ నుంచి బయలుదేరినట్టు కనిపిస్తుంది. కారు వెనుక సీటు నుంచి చిత్రీకరించిన ఈ వీడియోలో, మోడల్ వై కారు రహదారుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడం, మలుపులు తిరగడం, స్టాప్ సైన్‌లను పాటించడం, రెడ్ లైట్ల వద్ద ఆగడం, రియల్ టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా నిర్వహించడం స్పష్టంగా కనిపించింది. ప్రయాణం చివరిలో, మోడల్ వై యజమాని భవనం కింద స్వయంగా పార్క్ చేసుకుంది!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ వీడియోపై ఎక్స్‌లో "కపావ్" అంటూ ఒక్క పదంతో స్పందించారు.
"టెస్లా మోడల్ వై మొదటి, పూర్తి స్వయంప్రతిపత్త డెలివరీ ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి (హైవేలు సహా) ఒక రోజు ముందుగానే పూర్తయింది!!" అని ఎలాన్ మస్క్ ఎక్స్‌లో రాశారు. తదుపరి పోస్ట్‌లో, "కారులో ఎవరూ లేరు. ఏ దశలోనూ రిమోట్ ఆపరేటర్లు నియంత్రణలో లేరు. పూర్తిగా స్వయంప్రతిపత్తంగా!" అని పేర్కొన్నారు. "మాకు తెలిసినంతవరకు, పబ్లిక్ హైవేలో కారులో ఎవరూ లేకుండా లేదా రిమోట్‌గా కారును ఆపరేట్ చేయకుండా జరిగిన మొదటి పూర్తి స్వయంప్రతిపత్త డ్రైవ్ ఇదే," అని ఆయన అన్నారు.
మరోవైపు ,టెస్లాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోపైలట్ హెడ్ అశోక్ ఎల్లూస్వామి, ఈ ప్రయాణంలో వాహనం గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుందని ధృవీకరించారు.
గతంలో, జూన్ 22న, టెస్లా ఆస్టిన్‌లో తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోటాక్సీ సేవలను పరీక్షించడం ప్రారంభించింది. కొంతమంది ప్రముఖులు, పెట్టుబడిదారులు సెల్ఫ్-డ్రైవింగ్ మోడల్ వై కార్లలో ప్రయాణించారు. ఈ నెల ప్రారంభంలోనే మస్క్ తన ఎక్స్ ఖాతాలో రోబోటాక్సీ సేవలు, స్వీయ-డ్రైవింగ్ డెలివరీ గురించి సూచనలు ఇచ్చారు. భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ రోబోటాక్సీలను రోడ్లపైకి తీసుకురావాలని టెస్లా యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
టెస్లా మొదటిసారిగా ఏప్రిల్‌లో ఈ రకమైన హ్యాండ్స్-ఫ్రీ డ్రైవింగ్‌ను ప్రదర్శించింది. అప్పుడు దాని టెక్సాస్ ఫ్యాక్టరీ నుండి పార్కింగ్ స్థలాలకు కార్లు స్వయంగా వెళ్లిన వీడియోను సంస్థ పోస్ట్ చేసింది.
స్వయంప్రతిపత్త డెలివరీలు టెస్లా ప్రక్రియలో సాధారణ భాగం అవుతాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు.
సంబంధిత కథనం