TCS in FORTUNE list: ఫార్చూన్ జాబితాలో టీసీఎస్; అత్యంత గౌరవనీయ కంపెనీల్లో ఒకటిగా రికార్డు
TCS in FORTUNE list: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ కంపెనీల జాబితాలో టీసీఎస్ చోటు సంపాదించింది.

TCS in FORTUNE list: 2025కి గాను ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ కంపెనీల జాబితాలో భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ స్థానం సంపాదించింది. టెక్నాలజీ రంగంలో టీసీఎస్ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని టీసీఎస్ పొందింది. సేవల్లో వినూత్నత, క్లయింట్ల అవసరాలపై దృష్టి, ఉద్యోగులకు ప్రాధాన్యత.. వంటి పద్ధతులతో నిబద్ధతతో, వేగంగా మారిపోతున్న టెక్నాలజీ వ్యాపార రంగంలో అగ్రగామిగా టీసీఎస్ కొనసాగుతోంది.
ఐటీ సేవలు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్
‘‘ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ కంపెనీల’కు (World’s Most Admired Companies) సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో ఐటీ సేవలు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్‌లో అంతర్జాతీయ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చోటు దక్కించుకుంది. క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణలు, ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చే సంస్కృతిని పెంపొందింపచేయడం, ఏఐ, కొత్త తరం సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా దీర్ఘకాలికంగా సంబంధిత వర్గాలకు ప్రయోజనం చేకూర్చడంలో టీసీఎస్ సామర్థ్యాలకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తుంది’’ అని టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
సమగ్ర సర్వేతో..
నిర్దిష్ట అర్హత కలిగిన కంపెనీలకు చెందిన 3,300 మంది పైగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు అలాగే వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 650 పైచిలుకు కంపెనీలను మదింపు చేసిన ఫైనాన్షియల్ అనలిస్టులపై నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఫార్చూన్ వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీల జాబితాను ప్రతీ సంవత్సరం రూపొందిస్తారు. కార్పొరేట్ పేరుప్రఖ్యాతులకు ప్రామాణికంగా ఫార్చూన్ వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీల జాబితా ఉంటుంది. వార్షిక ర్యాంకింగ్‌లను సమగ్ర పర్చేందుకు ఫార్చూన్ రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ ఆర్గనైజేషనల్ కన్సల్టింగ్ సంస్థ కార్న్ ఫెర్రీతో (Korn Ferry) కలిసి పని చేస్తోంది. వినూత్నత, అంతర్జాతీయంగా వ్యాపారాలను నిర్వహించే సమర్ధత, ప్రతిభావంతులను ఆకర్షించడం, వారిని వృద్ధిలోకి తేవడంతో పాటు తమ వద్దే కొనసాగేలా అట్టే పెట్టుకోగలిగే సామర్థ్యం, కమ్యూనిటీ, పర్యావరణం విషయంలో జవాబుదారీతనం తదితర కీలక అంశాల ప్రాతిపదికన ఈ జాబితాలో కంపెనీలకు చోటు కల్పిస్తారు.
ఉద్యోగులకు ప్రాధాన్యత
ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వడంలో టీసీఎస్‌కి గల నిబద్ధతను కూడా ఈ గుర్తింపు తెలియజేస్తుంది. పీపుల్ ప్రాక్టీసెస్‌లో శ్రేష్టతకు సంబంధించి అంతర్జాతీయ ప్రాధికార సంస్థ టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ నుంచి టీసీఎస్ తొలిసారిగా ఈ ఏడాది ఎంటర్‌ప్రైజ్-వైడ్ టాప్ ఎంప్లాయర్ సర్టిఫికేషన్‌ను పొందింది. కంపెనీ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయి. అన్ని కీలక ప్రాంతాల్లోనూ పని ప్రదేశంలో శ్రేష్టమైన విధానాలను అమలు చేసే అతి కొద్ది సంస్థలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభిస్తుంది. అలాగే, 2025కి గాను గ్లోబల్ టాప్ ఎంప్లాయర్‌గా కూడా టీసీఎస్ పురస్కారం దక్కించుకుంది. ఉద్యోగుల సంతృప్తికి కంపెనీ పెద్ద పీట వేస్తోంది. ఐటీ సర్వీసుల్లో టీసీఎస్ నాయకత్వానికి పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ ర్యాంకింగ్‌లపరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది తొలినాళ్లలో కంపెనీ బ్రాండ్ విలువ 20 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2025 ఐటీ సర్వీసెస్ ర్యాంకింగ్‌ల ప్రకారం ఈ మైలురాయిని అధిగమించిన గ్లోబల్ ఏటీ సర్వీసుల కంపెనీల్లో రెండో కంపెనీగా నిల్చింది.
సంబంధిత కథనం