100 శాతం ఇథనాల్‌తో నడిచే టాటా కొత్త ఎస్‌యూవీ.. ఈ మోడల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి
Tata Punch Flex Fuel : 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తన కొత్త పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇథనాల్ (ఇ 85), 100 శాతం ఇథనాల్(ఇ 100) రెండింటిలోనూ పనిచేయగలవు. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త కొత్త వాహనాలను ప్రదర్శించాయి కంపెనీలు. టాటా మోటార్స్ పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్ వేరియంట్‌లో మనకు తెలిసిన అదే పంచ్ ఇది, కానీ ఇప్పుడు దీనిలో పెద్ద మార్పు ఉంది. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు ఇథనాల్ (ఇ 85), 100 శాతం ఇథనాల్ (ఇ 100) రెండింటిలోనూ నడుస్తుంది. ఇది స్మార్ట్, పర్యావరణ అనుకూల ఆప్షన్‌గా ఉండనుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు ప్రత్యేక ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. ఇథనాల్ ఒక జీవ ఇంధనం. ఇది ప్రధానంగా గోధుమ, మొక్కజొన్న, చెరకు నుండి ఉత్పత్తి చేస్తారు. ఇది పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రత్యేకతలు
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తన పెట్రోల్ వేరియంట్లకు శక్తినిచ్చే అదే 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. అయితే ఇథనాల్ మరింత ప్రమాదకరమైన ప్రభావాల నుండి రక్షించడానికి ఈ ఇంజిన్ కొద్దిగా అప్డేట్ చేశారు. అంటే ఈ ఇంజిన్ ఇప్పుడు 100 శాతం ఇథనాల్‌తో సరిగ్గా పనిచేస్తుంది.
పెట్రోల్ వేరియంట్‌లో 86బిహెచ్‌పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల పవర్, టార్క్ గణాంకాలు యథాతథంగా ఉంటాయి. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఎఎమ్‌టీ(ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఆప్షన్స్‌తో లభిస్తుంది.
దీనితో ఏంటి ప్రయోజనం?
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అభివృద్ధి కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఇది సహాయంగా ఉంటుంది. ఇథనాల్ వాడకాన్ని పెంచడం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా దేశ వ్యవసాయానికి ఊతం లభిస్తుంది. దేశీయ ఇథనాల్ ఉత్పత్తి చెరకు, ధాన్యాలు వంటి స్థానిక వనరుల నుండి ఉంటుంది.
ఈ చర్య ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పన్ను ఆదాయాన్ని పెంచుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. టాటా మోటార్స్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్‌ను ఎక్స్ పోలో ప్రదర్శించింది. ఇది ప్రభుత్వ కొత్త ఇంధన విధానానికి అనుగుణంగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెబుతుంది.