Tata Motors : రతన్ టాటా ప్రియ మిత్రుడికి.. టాటా మోటార్స్‌లో కీలక పదవి!
Shantanu Naidu Tata Motors : టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్ పదవిని చేపట్టినట్టు శంతను నాయుడు చెప్పారు. ఈయన దివంగత వ్యాపారేవత్త రతన్ టాటాకి ప్రియ మిత్రుడన్న విషయం తెలిసిందే.
దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా ప్రియ మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంతను నాయుడు తాజాగా ఒక ప్రకటన చేశారు. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌లో ఆయన.. స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా నియమితులైనట్టు తెలిపారు.

'టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్ - స్ట్రాటజిక్ ఇనీషియేటివ్‌గా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకుని ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురుచూసేవాడినని నాకు గుర్తు. ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్‌లోకి వచ్చింది," అని లింక్డ్ఇన్లో శంతను నాయుడు పేర్కొన్నారు.
ఎవరు ఈ శంతను నాయుడు? రతన్ టాటా స్నేహం ఎలా?
శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్. కాగా రోడ్డు మీద వేగంగా వెళ్లే వాహనాలతో శునకాలకు ప్రమాదం జరగకుండా ఆయన ఒక ఆవిష్కరణ చేేశారు. వాటి కోసం రేడియం కాలర్స్ తయారు చేశారు. ఈ విషయం.. కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్న రతన్ టాటాకి తెలిసింది. టాటా ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడమే కాకుండా, శాంతనుకు మార్గదర్శి, బాస్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం బలపడింది.
2018లో శంతను నాయుడు రతన్ టాటా సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించారు. వ్యాపార దిగ్గజంతో ఆయన సన్నిహిత స్నేహం అందరి దృష్టిని ఆకర్షించింది. టాటాకు జన్మదిన పాట పాడుతున్న నాయుడు వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది.
శంతను నాయుడు 2014 లో సవిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, 2016 లో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు.
తన పుస్తకం, I Came Upon a Lighthouse లో, శంతను టాటా వ్యాపార వారసత్వం దాటి వారి అసాధారణ స్నేహాన్ని, వ్యక్తిగత జీవితాన్ని హాస్యభరితమైన విధంగా వివరించారు.
టాటాతో ముడిపడి ఉన్న చారిత్రక మైలురాళ్ల కంటే.. వారి సాహసాలు, వ్యక్తిత్వం, కనిపించని అంశాల గురించి రాయాలనుకున్నట్టు నాయుడు చెప్పారు. అయితే, ఒకే ఒక్క పుస్తకంలో ప్రతిదీ చెప్పడం కష్టమే అని ఆయన అంగీకరించారు.
ఒక మిలీనియల్ - పరిశ్రమ దిగ్గజం మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహం కార్పొరేట్ ప్రపంచం వెలుపల.. రతన్ టాటా జీవితంలో సున్నితమైన కోణాన్ని ప్రపంచానికి ఆవిష్కరించింది.
రతన్ టాటా వీలునామాలో శంతను నాయుడు ప్రస్తావన..
2021లో శంతను నాయుడు ప్రారంభించిన గుడ్‌ఫెలోస్ అనే సంస్థలో యాజమాన్యాన్ని రతన్ టాటా వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేస్తుంది. ఆయన తన వీలునామాలో నాయుడు విద్యకు చేసిన అప్పును కూడా మాఫీ చేశారు.
2024 అక్టోబర్‌లో రతన్ టాటా మరణం అనంతరం శంతను నాయుడు భావోద్వేగ వీడ్కోలుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
సంబంధిత కథనం